మద్యం కుంభకోణం కేసు.. రూ.11 కోట్లు స్వాధీనం చేసుకున్న సిట్
posted on Jul 30, 2025 9:39AM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెరిగింది. ఈ కుంభకోణంలో దోచుకున్న కోట్ల రూపాయల సొమ్మును దాచిన ప్రదేశాన్ని గుర్తించిన సిట్.. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్టు చేసిన సిట్.. ఇప్పుడు ఈ కుంభకోణంలో దోచుకున్న సొమ్మునూ వెలికి తీస్తూ దూకుడుగా దర్యాప్తును సాగిస్తోంది.
అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సులోచనా ఫార్మ్‌గెస్టు హౌస్‌లో మద్యం సొమ్ము దాచిన డంప్ ను గుర్తించిన సిట్.. ఆ సొమ్ము స్వాధీనం చేసుకుంది. లిక్కర్‌స్కామ్‌లో ఏ 40 అయిన వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం మేరకు సిట్ అధికారులు సులోచనా ఫార్మ్‌గెస్టు హౌస్‌లో తనిఖీలు నిర్వహించగా సొమ్ము బయటపడింది. 11 అట్టపెట్టెలలో దాచిన 11 కోట్ల రూపాయలను సిట్ స్వాధీనం చేసుకుంది. రాజ్‌కసిరెడ్డి, చాణక్యల ఆదేశాల మేరకు ఈ కంపెనీలో 12 అట్టపెట్టెల్లో రూ.11కోట్ల సొమ్ములను దాచిపెట్టినట్లు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించి సొత్తును స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో రాజంపేట ఎంపి మిధున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు, అప్పటి సిఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్‌రెడ్డి, కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డి, భారతీ సిమెంట్స్ ఆడిటర్ గోవిందప్ప సహా పలువురిని సిట్ ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అక్రమద్యం ద్వారా 3వేల కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగినట్లు సిట్ మొత్తం మీద ఇప్పుడు పెద్ద మొత్తంలో నగదు లభ్యం కావడం ఈ కేసులో కీలకపరిణామమని పరిశీలకులు అంటున్నారు.