అంబటిపై కేసు నమోదు
posted on Jun 19, 2025 10:45AM

మాజీమంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. బుధవారం (జూన్ 18) జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ సత్తెన పల్లి పోలీసులు అంబటిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెడితే జగన్ పర్యటన సందర్భంగా పల్నాడు సరిహద్దులో పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు. అలాగే ఆంక్షలు ఉన్న నేపథ్యంలో వైసీపీ వాహనాలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కంటేపూడి వద్ద వైసీపీ పార్టీ నాయకుల వాహనాలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్న సందర్భంలో.. అదే మార్గంలో వచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తన వాహనంలో నుంచి దిగి బారీకేడ్లను తొలగించాలని పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసులు బారికేడ్లను తొలగించేది లేదని స్పష్టం చేయడంతో కార్యకర్తలతో కలిసి వాటిని నెట్టివేశారు.
ఆ సందర్భంగా ఆయన చాలా దురుసుగా వ్యవహరించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక దశలో పోలీసులతో తోపులాటకు దిగిన అంబటి.. ఆ క్రమంలో ఓ పోలీసును గాయపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే డ్యూటీలో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు 188,332, 353, 427 సెక్షన్ల కింద అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.