మల్లారెడ్డి చూపెటు.. సైకిల్ వైపా..కమలం వైపా?
posted on Jul 22, 2025 10:56AM
.webp)
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఛామకూర మల్లారెడ్డి కమలం గూటికి చేరనున్నారా? కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారా? అంటే తెలంగాణ రాజకీయవర్గాలలో ఔననే ప్రచారమే జరుగుతోంది. ఇటీవలి కాలంలో మల్లారెడ్డి బీఆర్ఎస్ కార్యక్రమాలలో పెద్దగా పాల్గొనడం లేదు. అదే సమయంలో ఆయన కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ అడుగులు బీజేపీవైపు పడుతున్నట్లుగా కనిపిస్తున్నది. వాస్తవానికి ప్రీతిరెడ్డి పొలిటికల్ గా యాక్టివ్ గా ఉంటారు. వచ్చే ఎన్నికలలో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు ఆమె బండి సంజయ్ ద్వారా ఆమె బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది.
ఇటీవల బోనాల వేడుకల సందర్భంగా బండి సంజయ్ ను ఆహ్వానిస్తూ , శుభాకాంక్షలు చెబుతూ పాతబస్తీలో పలు ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫ్లెక్సీలలో చాలా వరకూ బీజేపీ నేతలు, శ్రేణులు ఏర్పాటు చేసినవే. అయితే బండి సంజయ్ కు స్వాగతం పలుకుతూ చామకూర మల్లారెడ్డి కోడలు ప్రీతీరెడ్డి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే బండి సంజయ్ కు విందు కూడా ఇచ్చారు. ప్రీతిరెడ్డి ఫ్లెక్సీలు, ఆమె ఇచ్చిన విందుకు బండి సంజయ్ హాజరైన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయిన తన మామ మల్లారెడ్డి అనుమతి, ఆశీర్వాదం లేకుండానే ప్రీతిరెడ్డి బీజేపీకి అనుకూలంగా ఇలా వ్యవహరిస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత కొంత కాలంగా రాజకీయంగా పెద్దగా యాక్టివ్ గా కనిపించని మల్లారెడ్డి.. బీఆర్ఎస్ కు దూరం జరుగుతున్నారన్న ప్రచారం ఇప్పటికే జోరుగా ఉంది. ప్రీతిరెడ్డి బండి సంజయ్ కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఆయనకు విందు ఇవ్వడం మల్లారెడ్డి వ్యూహమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.