వైసీపీ నాయకులు ఏరీ?.. ఎక్కడ?
posted on Jun 19, 2025 10:19AM

ఉమ్మడి చిత్తూరు జిల్లా అనగానే వైసీపీ కంచుకోట అనేలా గత ఐదు సంవత్సరాలు పాలన సాగించారు. ఓవైపు పెద్దిరెడ్డి, ద్వారకానాథ రెడ్డి, మిథున్ రెడ్డి, మరో వైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, ఇంకో వైపు కరుణాకర్ రెడ్డి ఇలా ఒక్కరేమిటి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే లు, వైసీపీ కీలక నాయకులు చేసిన హడావిడి అంతాఇంతా కాదు. అలాంటి నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న అరాచశక్తుల అరెస్టుల పై నోరు మెదపడం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గా ఎన్నికై ఆ తరువాత వెనక్కి ఇచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నోరేసుకుని ముందు వరసలో నిలబడే మాజీ మంత్రి రోజా, దొంగ ఓట్లు నమోదు చేయించడంలో సిద్దహస్తుడైన ప్రస్తుత ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఎవరు ఏమీ మాట్లాడటం లేదు. గడిచిన రోజుల్లో భూకబ్జాలు, మఠం భూముల స్వాహాపై పెద్దిరెడ్డి పై వచ్చిన ఆరోపణలు, మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర పై ఆరోపణలు, ఇక తాజాగా అరెస్టు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతా జిల్లా నేతలే అయినా నోరెత్తి మాట్లాడేందుకు వైసీపీ నేతలకు ధైర్యం చాలడం లేదు.
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఎన్నికైన వారు సైతం అప్పుడో.. ఇప్పుడో ప్రెస్ మీట్లు పెట్టి నాలుగేళ్ల తరువాత తాము అధికారంలోకి వస్తాం, అంతుచూస్తాం అంటూ బీరాలు పలుకుతున్నారు తప్ప, తమ వారు చేసింది కరెక్టేనన్న మాట చెప్పడానికి వారికి నోరు రావడం లేదు దీనిపై జిల్లా వ్యాప్తంగా ప్రజలు గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారు కనునకే ఇప్పుడు వారికి తగిన శాస్తి జరుగుతోంది. వారికి శిక్ష పడాలి అంటూ బాహాటంగానే చెబుతున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు, క్యాడర్ మాత్రం కలుగులో దాక్కున్నట్లుగా మనదాకా రాకుంటే బాగుండును అనుకుంటూ మౌనంగా ఉంటున్నారు.