రోజా అందుకు బాధ పడటం లేదుట!

 

వైకాపా ఎమ్మెల్యే రోజా శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అనుచితంగా వ్యహరించినందుకు ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేయబడ్డారు. ఆమెను సభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేయడం సరికాదని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. అయితే రోజా మాత్రం తనను సస్పెండ్ చేసినందుకు బాధపడటం లేదని చెప్పడం విశేషం. సస్పెండ్ చేయడం కంటే సస్పెన్షన్ చేసిన తీరుకే బాధపడుతున్నానని ఆమె అన్నారు. కానీ ఊహించని ఈ పరిణామంతో ఆమెను ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కి ఉందా లేదా? అనే చర్చ మొదలయిందిపుడు. సభ నుండి ఏడాదిపాటు సస్పెండ్ అయినందుకు ఆమె ఏమాత్రం బాధపడనపుడు, ఆమెను సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కి ఉందా లేదా? అనే చర్చ అనవసరమేనని చెప్పవచ్చును.

 

ఇదివరకు తెలంగాణా శాసనసభ నుంచి తెదేపా ఎమ్మెల్యేలు అందరినీ సమావేశాలు జరిగినంత కాలానికి సభ నుంచి సస్పెండ్ చేసినపుడు వారు స్పందించిన తీరుకు, ఇప్పుడు రోజా స్పందిస్తున్న తీరుకి చాలా తేడా కనబడుతోంది. తెదేపా ఎమ్మెల్యేలు అందరూ తమను సస్పెండ్ చేయడాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ఆ తరువాత స్పీకర్ మధుసూదనాచారిని కలిసి తమపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయమని విన్నవించుకొన్నారు. అయినప్పటికీ సస్పెన్షన్ ఎత్తివేయక పోవడంతో గవర్నర్ నరసింహన్ ని కలిసి పిర్యాదు చేసారు. కానీ రోజా తనను సస్పెండ్ చేసినందుకు బాధపడటం లేదని చెప్పడం విశేషం.

 

ఒకవేళ ఆమెకు తనపై ఏడాదిపాటు విధించినందుకు బాధపడి ఉంటే ఆమె సభలోనే తన తప్పును అంగీకరించి, మళ్ళీ అటువంటి తప్పులు పునరావృతం కానీయనని హామీ ఇచ్చి తన సస్పెన్షన్ ఎత్తివేయామని స్పీకర్ ని ప్రాధేయపడి ఉండేవారు. ఐదేళ్ళ కాలపరిమితిలో ఏకంగా ఒక ఏడాదిపాటు సస్పెండ్ చేయబడినందుకు ఆమెకు ఏమాత్రం బాధ కలగకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu