కాల్‌మనీ కథలు -3 - ప్రాణాలు తీస్తున్న పాపిష్టి వ్యాపారం
posted on Dec 18, 2015 10:35AM

కాల్‌మనీ కాలనాగుల కాటుకు ఎన్నో జీవితాలు బలైపోయాయి. ఇప్పుడు కాల్‌మనీ వ్యవహారం బయట పడటంతో కాల్‌మనీ వ్యాపారులు చేసిన అకృత్యాలు ఒకదాని వెంట మరొకటి వెలుగులోకి వస్తోంది గానీ, కాలగర్భంలో కలసిపోయిన అకృత్యాలకు, దారుణాలకు అంతేలేదు. కాల్‌మనీ వ్యవహారం బయటపడి, ప్రభుత్వం వడ్డీ వ్యాపారుల భరతం పడుతూ వున్నప్పటికీ, కాల్‌మనీ వ్యాపారుల బారిన పడిన చిత్తూరు జిల్లాకు చెందిన ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా కాల్‌మనీ వ్యాపారుల పడగ నీడ నుంచి తప్పించుకునే అవకాశం వుందని తెలుసుకోలేక నలుగురు సభ్యుల ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం దిగ్భ్రాంతికర అంశం. చిత్తూరు జిల్లా దిగువ నాగులపల్లె గ్రామానికి చెందిన శివశంకర్ కుటుంబం అధిక వడ్డీలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. అలాగే ప్రకాశం, అనంతపురం జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యా ప్రయత్నం చేసి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే కాల్‌మనీ వ్యాపారుల బారిన పడిన ఒక ఆటో డ్రైవర్ భార్యను కాల్‌మనీ వ్యాపారం చేసే ఒక న్యాయవాది తన అదుపులో వుంచుకున్నాడన్న విషయం బయటపడింది. కాల్‌మనీ వ్యాపారులు చేసిన దుర్మార్గాలు, దారుణాలు ఇప్పుడు వరుసగా బయటపడుతున్నాయి. అయితే విజయవాడకు చెందిన కాల్‌మనీ వ్యాపారి కారణంగా ఎంతో భవిష్యత్తు వున్న ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం ఇప్పటి వరకూ కాలగర్భంలో కలసిపోయింది. ఇప్పుడు ఆ దారుణం బయటపడింది.
విజయవాడలో కాల్‌మనీ వ్యాపారంలో ముదిరిపోయిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు గతంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు. సదరు ప్రజా ప్రతినిధుల దగ్గర చెమ్చాగిరీ చేస్తూ, బలవంతపు వసూళ్ళు చేసే ఒక వ్యక్తి కారణంగా ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబం కాల్‌మనీ ఉచ్చులో చిక్కుకుపోయింది. ప్రజా ప్రతినిధుల అనుచరుడి కన్ను ఆ కుటుంబంలో వున్న యువతి మీద పడింది. అప్పు సాకు చెప్పి ఆ యువతిని వేధించడం ప్రారంభించాడు. దాంతో ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. సదరు కాల్‌మనీ వ్యాపారుల హవా నడిచిన కాలంలో జరిగిన ఈ ఆత్మహత్య అసలు విషయం బయట పడకుండానే కాలగర్భంలో కలసిపోయింది. ఇప్పుడు బయటపడింది. ఇంకా ఇలాంటి ఎన్ని దారుణాలను కాల్‌మనీ వ్యాపారులు సమాధి చేశారో!
(కాల్‌మనీ వ్యవహారానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తదుపరి ఆర్టికల్‌లో.....)