చిత్రకారిణి హేమా ఉపాద్యాయ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్

 

ముంబైకి చెందిన ప్రముఖ చిత్రకారిణి హేమా ఉపాద్యాయ్ (43), ఆమె లాయర్ హర్ష్ భంబానీ (65) జంట హత్యల కేసును మహారాష్ట్ర పోలీసులు చేదించారు. ముంబై సమీపంలోని ఖాండివిల్లీ అనే పట్టణంలో శనివారం సాయంత్రం ఒక మురికి కాలువలో వారిరువురి శవాలను పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. హేమా ఉపాద్యాయ్ తన భర్త చింతన్ ఉపాద్యాయ్ తో మనస్పర్ధలు రావడంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకొంది. ఆమె తరపున లాయర్ హర్ష్ భంబానీ వాదిస్తున్నారు. వారిరువురూ హత్యకాబడటంతో సహజంగానే పోలీసులు ఆమె భర్తనే అనుమానించారు. కానీ వారి హత్యకేసులో ఆమె భర్తకు ఎటువంటి సంబంధం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.

 

తమ మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులకు అభ్యర్ధించినప్పటి నుండి తాను డిల్లీలో ఉంటున్నానని, అప్పుడప్పుడు ఏదయినా పని మీద ముంబై వచ్చినప్పుడు తమ ఇంట్లోనే ఉంటున్నానని అతను తెలిపాడు. తన బార్యకు తనకు ముంబైలోని ఒక ఫ్లాట్ విషయంలో గొడవలు జరుగుతున్న మాట వాస్తవమని, అయినప్పటికీ తాను దాని కోసం ఆమెను హత్య చేసేంత కిరాతుకుడిని కానని పోలీసులకు తెలిపాడు. తన భార్యకు చెల్లించవలసిన భరణం రూ. రెండు లక్షలను ఆమె చనిపోయే ముందు రోజే ఆమె లాయరుకి చెల్లించానని చింతన్ ఉపద్యాయ్ తెలిపాడు. అతను తన భార్య అంతిమ క్రియలకు కూడా హాజరయ్యాడు.

 

పోలీసుల దర్యాప్తులో వారిరువురిని హత్య చేసింది ఉత్తరప్రదేశ్ కి చెందిన విజయ్ రాజ్భర్, ప్రదీప్ రాజ్భర్, ఆజాద్ రాజ్భర్ మరియు శివ కుమార్ రాజ్భర్ అనే నలుగురు వ్యక్తులని తేలింది. వారిలో శివ కుమార్ రాజ్భర్ అనే వ్యక్తిని వారణాసిలో పోలీసులు పట్టుకొన్నారు. అతనిచ్చిన సమాచారంతో మిగిలిన ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేయగలిగారు. వారు నలుగురు ఉత్తరప్రదేశ్ లో రాంపూర్ అనే ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వారు విగ్రహాలు తయారు చేస్తుంటారు. వారి వద్ద నుండి 20 డెబిట్/క్రెడిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వాటిలో తొమ్మిది కార్డులు హేమా ఉపాద్యాయ్, ఆమె లాయర్ హర్ష్ భంబానీలకు చెందినవే. మిగిలిన కార్డులు వేరేవారికొ చెందినవని పోలీసులు గుర్తించారు. అంటే ఆ నలుగురు కలిసి ఇంకా చాలా హత్యలు, దోపిడీలు చేసి ఉండవచ్చని స్పష్టం అవుతోంది.

 

హేమా ఉపాద్యాయ్, హర్ష్ భంబానీ నోట్లో తామే గుడ్డలు కుక్కి హత్య చేసి వారి శవాలను ప్లాస్టిక్ గోనె సంచీలో చుట్టి మురికికాలువలో పడేశామని వారు అంగీకరించారు. హత్యకు కారణం డబ్బేనని ప్రాధమికంగా రుజువు అయ్యింది. కానీ వేరే ఇతర కారణాలు ఉన్నాయా? హేమా ఉపాద్యాయ్ భర్తకి వారితో ఏమయినా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu