వీర జవాన్ మురళీ నాయక్ పార్థీవదేహాన్ని మోసిన మంత్రి నారా లోకేష్

 

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కళ్లితండాలోని నివాసం వద్ద మురళీ నాయక్ భౌతికకాయాన్ని సందర్శించి అశ్రు నివాళులు అర్పించారు. మురళీనాయక్ పార్థీవదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి సెల్యూట్ చేశారు. అనంతరం అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని వారిని ఓదార్చారు. 

మురళీ నాయక్ స్నేహితులు, బంధువులను పరామర్శించారు. యుద్ధానికి ముందు వీరజవాన్ మురళీ నాయక్ బంధువు, స్నేహితుడు రాజశేఖర్ తో జరిపిన వాట్సాప్ చాట్ ను మంత్రి పరిశీలించారు. మురళీనాయక్ జ్ఞాపకాలను ఈ సందర్భంగా బంధువులు పంచుకున్నారు. వీరజవాన్ మురళీ నాయక్ కు జై, భారత్ మాతాకి జై, వందేమాతరం అంటూ ప్రజలు, స్థానికులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అగ్నివీర్ మురళీ నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారీసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

 

వీరజవాన్ మురళీ నాయక్ పార్థీవదేహాన్ని మోసిన మంత్రి లోకేష్

వీరజవాన్ మురళీ నాయక్ అంతిమ యాత్రలో పాల్గొన్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. మురళీ నాయక్ పార్థీవదేహాన్ని స్వయంగా మోసారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య మురళీ నాయక్ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలను పూర్తిచేశారు. అంతకుముందు ఉదయం నుంచి వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి లోకేష్ దుగ్గరుండి పర్యవేక్షించారు. అధికారులతో మాట్లాడి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, సవిత, సత్యకుమార్ యాదవ్, ఎంపీ బీకే పార్థసారథి, మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పల్లె సింధూరారెడ్డి, ఎంఎస్ రాజు, జేసీ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu