వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన డిప్యూటీ సీఎం పవన్
posted on May 11, 2025 11:31AM
.webp)
దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్‌కు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ నివాళి అర్పించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు వెళ్లి జవాను భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. మురళీనాయక్ తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. మురళీ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిలను డిప్యూటీ సీఎం ఓదార్చారు. కుమారుడు మురళీ నాయక్‌ను గుర్తు చేసుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పవన్ కళ్యాణ్ గుండెలకు హత్తుకుని బోరున విలపించారు. దీంతో పవన్ కూడా కంటతడి పెట్టారు.
అనంతరం కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా కల్పించారు. కూటమి సర్కార్ తరఫున రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు పవన్ తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి ఐదెకరాలతో పాటు 300 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించారు. వీరజవాను కుటుంబానికి రూ.25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని డిప్యూటీ సీఎం కళ్యాణ్ పవన్ హామీ ఇచ్చారు.
ఇంకా ఎలాంటి సాయం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మురళీనాయక్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. మరోవైపు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకువచ్చారు. బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి కల్లితండాకు తీసుకు వస్తున్న సమయంలో జై జవాన్ జై జవాన్ అంటూ రోడ్డు పొడవునా జనం నివాళులు అర్పించారు. ఆదివారం మురళీ నాయక్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించ నున్నారు. హోంమంత్రి అనిత, మంత్రులు సత్య కుమార్ యాదవ్, సవిత, ఎంపీ పార్థసారథితోపాటు పలువురు ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు