పాకిస్థాన్ మేజర్ జనరల్ షరీఫ్ ఎవరో తెలుసా?
posted on May 11, 2025 10:45AM
.webp)
భారత్.. పాక్, కెనెడాలో ఉగ్రవాదం ప్రేరేపిస్తోందని అభాండాలు వేశారు పాక్ డీజీ ఐస్ పీఆర్ అహ్మద్ షరీఫ్. ఈయన మరెవరో కాదు సన్నాఫ్ సుల్తాన్ బషీరుద్దీన్. ఈ బషీరుద్దీన్ మరెవరో కాదు.. పాకిస్థాన్ కి రెండో అణుపితామహుడు. ఒసామా బిన్ లాడెన్ కి, అల్ ఖైదాకి అణ్వాయుధాలను సరఫరా చేద్దామనుకున్నవ్యక్తి. తాలిబన్ చీఫ్ ముల్లా ఓమర్ ని కూడా కలిసిన వాడు.
అత్యంత భయంకరమైన ఇస్లామిక్ తీవ్రవాది ఈ సుల్తాన్ బషీరుద్దీన్. ఇతడి ఆలోచన ప్రకారం అల్ ఖైదాకు అణ్వాయుధాలను సరఫరా చేసి.. తద్వారా నాగరిక ప్రపంచాన్ని నామరూపాల్లేకుండా చేయడం. అప్పటికే 911 దాడులతో విమాన భద్రతా నియమాలనే మార్చేసిన ఘటనకు కారకుడైన లాడెన్ తో ఇతడి భేటీని చూసి భయపడ్డ యూఎస్ వెంటనే యూఎన్ దృష్టికి ఇతడ్ని తీస్కెళ్లింది. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. తర్వాత ఇతడి మీద ఐఎస్ఐ చేత దర్యాప్తు చేయించింది. ఈ దర్యాప్తులో తాను లాడెన్ని కలిసిన మాట వాస్తవమేనని చెప్పాడు. దీంతో ఒకింత ముందుగానే ఇతడు తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
పాక్ యురేనియం వ్యవహారాలు ఇంకా ఎన్నో నిషిద్ధ ఆయుధాల తయారీకి పాక్ అణు పితామహుడు ఖాదిర్ ఖాన్ తర్వాత ఆ స్థాయి నాయకత్వం వహించాడు సుల్తాన్ బషీరుద్దీన్. అయితే తనకున్న ఇస్లామిక్ తీవ్ర వాదం దృష్ట్యా లాడెన్ వంటి వారికి దగ్గరై.. తన పదవి కోల్పోయాడు. ఆపై ఉగ్రవాద అనుకూల సంస్థ యూటీఎన్ ని స్తాపించాడు. తద్వారా.. ఉగ్రవాద వ్యాప్తికి మరింత కృషి చేశాడు. ఇతడి సంస్థ కార్యాలయంలో శోధనలు చేస్తే అణ్వాయుధ అక్రమ తయారీకి సంబంధించి ఎన్నో పత్రాలు లభించాయి.
ఎలాగైనా సరే ఉగ్రవాదానికి అణు శక్తిని జోడించాలన్నది అహ్మద్ షరీఫ్ తండ్రి ఎత్తుగడ. అలాంటి తండ్రికి పుట్టిన తనయుడు అహ్మద్ షరీఫ్ ఈ రోజు పాక్ లో సైనిక పరంగా అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. పాక్ టాప్ మోస్ట్ మిలటరీ అఫిషియల్స్ లో ఇతడు కూడా ఒకడు. ఒక ఉగ్రవాది కొడుకు భారత్ కి ఉగ్రవాద కోణం అంటగడుతుంటే విడ్డూరమనిపిస్తుంది. అంతే కాదు ఆ దేశపు సైనిక ఉగ్ర సంబంధం తండ్రీ కొడుకుల బంధమని కూడా చెప్పాల్సి ఉంటుంది.