వచ్చే ఎన్నికలలో బీజేపీ నినాదం మోడీ!

ప్రస్తుతం బీజేపీకి మోడీ వినా మరో ప్రజాకర్షక నేత లేరు. నిజమే ఇప్పుడు మోడీ తప్పితే ప్రస్తుతం బీజేపీలో ఇమేజ్ ఉన్న నేత మరొక్కరు లే రు. అందుకే పార్టీని మించి ఎదిగిన మోడీ పెత్తనాన్ని ఆర్ఎస్ఎస్ అనివార్యంగా భరిస్తోంది. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ నినాదం, ఆశ, ఆస్త్రం అన్నీ మోడీయే. ప్రచార సారథీ మోడీయే.

అందుకే తన కోసం తన కాళ్లకు తానే   బలపాలు కట్టుకు మరీ తిరగాల్సిన పరిస్థితి ఇప్పుడు మోడీది. నిజమే కాంగ్రెస్, దేశంలో కొన్ని ప్రాంతీయ పార్టీలూ ఎలా అయితే ఒకే ఒక వ్యక్తిపై ఆధారపడి బండి లాగిస్తున్నాయో.. బీజేపీ కూడా అలాగే మోడీపై ఆధారపడి మనుగడ కొనసాగిస్తోంది. గతంలో కాంగ్రెస్ లో ఈ విధానాన్ని తీవ్రంగా విమర్శించిన  బీజేపీ ఇప్పుడు అదే విధానాన్ని అనుసరిస్తున్నది. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అంతా మోడీ షో అన్నట్లుగానే సాగుదోంది. బీజేపీలో, ప్రభుత్వంలో అంతా తానే అయిన పరిస్థితిపై మోడీ ఇటీవల జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రస్తావించారు. అన్నిటికీ తన ఇమేజ్, తన పేరు ఉపయోగించడంపై ఒకింత అభ్యంతరం చేశారు. అన్నిటికీ తానే రావాలని, తాను వస్తేనే విజయం అన్న మైండ్ సెట్ నుంచి బయటకు రావాలని పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోడీ పార్టీ నేతలకు చెప్పారు. అయితే ఆయన ఆ మాట కేవలం మాటవరసకే చెప్పారన్న విషయం అప్పుడే అందరికీ అర్ధమైంది. పార్టీకి  మోడీ పేరు ఓ తారక మంత్రంగా మారింది. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లు బీజేపీ నేతలకు మోడీ జపం వినా మరోటి లేకుండా పోయింది.  

ఇటీవల జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆ రాష్ట్రానికి చెందిన నేతే ఉన్నా తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించడానికి స్వయంగా మోడీయే ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే.. ఆయన ఆధిపత్యం, ప్రాముఖ్యతా పార్టీలో ఎంతగా పాతుకుపోయాయో అర్ధం చేసుకోవచ్చు. ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికకు  బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులను మోడీ తన వ్యక్తిగత హోదాలో అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి ఉందంటే.. పార్టీగా బీజేపీ పరిస్థితి ఏమిటో అర్ధం అవుతుంది.  ఉదాహరణకు హిమాచల్ విషయం చెప్పుకున్నాం కానీ.. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ పరిస్థితి ఇలాగే ఉంది.

రాష్ట్ర విభాగాలన్నీ మోడీ ఆదేశాల కోసమే ఎదురు చూస్తాయి తప్ప సొంతంగా పని చేసే శక్తియుక్తులను ఎప్పుడో కోల్పోయాయి. అందుకే కాంగ్రెస్ పార్టీకి పోటీగా, దీటుగా రాష్ట్రాల్లో బీజేపీలో కుమ్ములాటలు వర్ధిల్లుతున్నాయి.  సంఘ్ పరివార్ నుంచి వచ్చిన పాత బీజేపీ నేతలకు బయటి నుంచి, ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి  వచ్చి చేరిన నేతల మధ్య విభేదాలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. ఇంతకాలం బీజేపీ జెండా, అజెండా మోసిన తమను కాదని బయటి నుంచి వచ్చిన వారికి పార్టీలో ప్రాధాన్యత పెరగటం, వారికి అధికారం కట్టబెట్టడాన్ని పాతనాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పంటి బిగువన తమ ఆగ్రహాన్ని అణచుకుంటున్నారు.

ఒక్కో సారి పార్టీని ధిక్కరించడానికి కూడా వెనుకాడని పరిస్థితులూ ఏర్పడుతున్నాయి. ఇలాంటి సంఘటనలు  తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో  అంతర్గత కుమ్ములాటల రూపంలో బయటకు వస్తూనే ఉంది. వీటి పరిష్కారానికి సైతం మోడీయే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఉంది.

ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ఇమేజ్ అనే ఏకైక అస్త్రంతో కదన రంగంలోకి అడుగుపెడుతోంది.  వరుసగా మూడవసారి అధికారం చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో మోడీ ఉన్నారు.  నెహ్రూ వరుసగా మూడుసార్లు దేశాన్ని ఏలినట్టు తన పేరు కూడా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవాలని మోడీ కోరుకుంటున్నారు. అందుకే మోడీ కూడా నెహ్రూ అడుగుజాడలలో అంతర్జాతీయ వేదికలపై గౌరవం పొందడం ద్వారా దేశ ప్రజల మనస్సులలో స్థానాన్ని పదిల పరుచుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగమే ఇండియాలో జీ20 శిఖరాగ్ర సదస్సు అని పరిశీలకులు అంటున్నారు.    

Online Jyotish
Tone Academy
KidsOne Telugu