జగన్ పై కోటం రెడ్డి రివోల్ట్.. కారణమేమిటంటే?

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వైసీపీకి  రాం.. రాం చెప్పేశారు.  అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున బరిలో దిగాలనుందంటూ..  తన మనస్సులోని మాటను బయటపెట్టేశారు.  అయితే తెలుగుదేశం నుంచి పోటీ విషయంలో  నిర్ణయం మాత్రం చంద్రబాబుదేనంటూ  ముక్తాయించారు. ఈ ఏడాది జనవరి 2వ తేదీన తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం  జగన్‌తో కోటంరెడ్డి భేటీ అయ్యారు.  అయితే ఆ భేటీ జరిగిన నెల రోజులకే కోటంరెడ్డి..  ఇకపై వైసీపీలో ఉండలేనంటూ..  ఫ్యాన్‌ స్వీచ్ ఆప్ చేసి మరి బయటకు వచ్చేయడం సంచలనంగా మారింది.  కోటంరెడ్డి నిర్ణయం పట్ల వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అయితే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలో తొలి నాళ్ల నుంచి ఆవేశం ఉండేదని..  కానీ  జగన్ తొలి కేబినెట్‌లోనే కాదు.. మలి కేబినెట్‌లో సైతం ఆయనకు మంత్రిపదవి దక్కకపోవడంతో పాటు..  తన సొంత జిల్లాలో.. అదీ జస్ట్... తన పక్క నియోజకవర్గం నుంచి గెలుపొందిన సహచర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను జగన్ తన తొలి కేబినెట్‌లోకి తీసుకోవడం..  ఆ తర్వాత జరిగిన మలి కేబినెట్‌ కూర్పులో సైతం.. అదే  జిల్లాకు చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డికి కేబినెట్ బర్త్ కేటాయించడం.. ఈ ఇద్దరికీ అత్యంత కీలక శాఖలను  కేటాయించడం..   కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఏ మాత్రం జీర్ణించుకోలేదనే ఓ చర్చ అప్పుడూ, ఇప్పుడూ కూడా జిల్లాలో వాడి వేడిగా నడుస్తోంది. అదీకాక దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మీద ఉన్న అభిమానంతో..   జగన్ మీద ఉన్న నమ్మకంతో కోటంరెడ్డి ఫ్యాన్ పార్టీలో చేరారన్న సంగతి అందరికీ తెలిసిందే.  2014లో తొలిసారి నెల్లూరు రూరల్ స్థానం నుంచి ఫ్యాన్ పార్టీ తరఫున పోటీ చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపొందారు. అయితే నాడు పార్టీ విపక్షంలో ఉండడంతో.. జగన్ అధికారంలోకి వస్తే.. తనకు మంత్రిగిరి దక్కుతోందని కూడా భావించారని ఆయన కోటరీలోని వారు ఇప్పటికీ చెబుతుంటారు. అంతేకాదు..  వైయస్ జగన్ అధికారంలోకి రావడం కోసం జిల్లాలో ఫ్యాన్ పార్టీ గెలుపు కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారని కూడా ఆయన వర్గం చెబుతోంది.  ఆ క్రమంలో 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లో జగన్ పార్టీ జెండా రెపరెపలాడిందని.. అలాగే రాష్ట్రంలో కూడా ఫ్యాన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందని.. దీంతో వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయినా... కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాత్రం మంత్రిగిరి దక్కలేదని.. చర్చ సైతం సాగుతోంది. 

అలాగే జగన్ మలి కేబినెట్‌ కూర్పుకు ముందు కూడా కోటంరెడ్డి.. తన నియోజకవర్గంలో రాజకీయ పరంగా జగనన్న వదిలిన బాణంలా దూసుకుపోయారని.. ఆ క్రమంలో పార్టీలోని శ్రేణుల పడుతున్న ఇబ్బందులు తెలుసుకొనేందుకు.. తన నియోజకవర్గంలో నేను.. నా కార్యకర్త అంటూ దాదాపు 50 రోజులు పాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి పాదయాత్ర సైతం నిర్వహించారని... కానీ జగన్ మలి కేబినెట్‌లో మాత్రం ఆయనకు స్థానం దక్కలేదని... ఈ నేపథ్యంలో ఈ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టోన్‌లో జగన్ పార్టీ పట్ల విముఖత స్పష్టంగా వినిపిస్తూ వస్తోందనే టాక్ సైతం వైరల్ అవుతోంది. అందులోభాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్లీనరీలో కోటంరెడ్డి మాట్లాడుతూ.. అధికార మదంతో ప్రవర్తిస్తే, అధికార మదం తలకెక్కితే ప్రజలు వాత పెడతారని.. సొంత పార్టీ వారిని హెచ్చరించారు. అంతేకాదు... ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడవద్దని వైసీపీ శ్రేణులకు ఆయన హితవు పలికారు. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే కోటంరెడ్డిలో చోటు చేసుకున్న అసంతృప్తి క్లియర్ కట్‌గా అర్థమువుతోందనే చర్చ సైతం సాగుతోంది. 

అలా మొదలైన కోటంరెడ్డిలో ప్రస్ట్రేషన్.. నేడు పీక్స్‌ చేరిందని.. అంతేకాదు తన ఫోన్ ట్యాపింగ్ అంశం.. కోటంరెడ్డిని జీర్ణించుకోలేకుండా చేశాయని..  అందుకే నమ్మకం లేని చోట ఉండలేనంటూ ఆయన వైసీపీకి పార్టీకి గుడ్ బై చేప్పేశారు.  ఇక వైయస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. టీడీపీ అధినేత చంద్రబాబుపై కోటంరెడ్డి గట్టిగానే నోరు పారేసుకొన్నారని.. ఆ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుది భస్మాసూర హస్తమని.. ఆ భస్మాసురుడికే ఈ చంద్రబాబు పెద్దన్న అన్నారని.. అలాగే.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం తగలబడిపోయిందన్నారని.. రాష్ట్ర చరిత్రలోనే చంద్రబాబు ఓ విఫల నాయకుడిగా అభివర్ణించారని.. తన ఐదేళ్ల పాలనపై చంద్రబాబు... ఆత్మపరిశీలన చేసుకోకుండా తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ని నరకాసురుడని విమర్శలు చేయడం దారుణమంటూ కోటంరెడ్డి పలు వేదికలపై నుంచి వ్యాఖ్యలు సైతం చేశారని చర్చ సైతం సైకిల్ పార్టీలో సవారీ చేస్తోంది.  

మరోవైపు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌లో నరకాసురుడి పాలన కనిపిస్తోందా? చంద్రబాబు అవినీతిని బైట పెట్టిన వైయస్ జగన్‌లో నరకాసురుడు కనిపిస్తున్నాడా? అంటూ నాడు చంద్రబాబుపై ఇదే కోటంరెడ్డి నిప్పులు సైతం చెరిగారని తెలుగుదేశం శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. కేవలం ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో రాజన్న రాజ్యాన్ని మించిన జగనన్న రాజ్యాన్ని తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చారని కూడా కోటంరెడ్డి తన ప్రెస్‌మీట్‌లో గుర్తు చేశారని.... అలాగే  చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రంలో కరువు కటకాలతో ఉండేదని... జగన్ సీఎం అయ్యాక రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని కూడా అన్నారని.. అలాగే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికి పడిపోతోందంటూ కోటంరెడ్డి జోస్యం కూడా చెప్పారనే చర్చ సైతం టీడీపీలో సాగుతోంది. 

అయితే పార్టీ అధినేత చంద్రబాబుపై ఇలాంటి వాఖ్యలు చేసిన.. కోటంరెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దంటూ.. తెలుగుదేశంలోని ఓ వర్గం   అడ్డం పడుతోన్నట్లు సమాచారం. అదీకాక గతంలో ఇన్ని విమర్శలు చేసిన ఆయన.. నేడు పార్టీలోకి వస్తే.. పార్టీ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇచ్చినట్లు అవుతోందనే ప్రశ్న కూడా ఉదయించినట్లు తెలుస్తోంది. మరోవైపు... టీడీపీతో కోటంరెడ్డి.. ముందుగానే మంతనాలు చేసుకొన్నారని.. ఆ తర్వాతే.. జగన్ పార్టీకి బై బై చెప్పేశారని.. జగన్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబుపై ఇన్ని ఆరోపణలు గుప్పించిన.. కోటంరెడ్డిని సైకిల్ పార్టీలోకి ఆహ్వానిస్తారా? లేకుంటే.. సజ్జల చెప్పినట్లు.. ముందే వేసుకొన్న పథకం ప్రకారం.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ముందుకు వెళ్తున్నారా? ఓ వేళ.. టీడీపీలో కోటంరెడ్డి రాకకు అడ్డు పడితే... ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది.. ఆయనను నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏమిటంటే మాత్రం.. అందుకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.