పుట్టినరోజే అబద్దాలా?.. జగన్ పథకం గుట్టు బయటపెట్టిన బీజేపీ!
posted on Dec 22, 2020 12:06PM
ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీ సర్వే కోసం 'వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష' పేరుతో సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు వద్ద సర్వేరాయి పాతి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మర్చి ప్రచారం చేసుకుంటున్నారని.. సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టినా.. ఆయనలో ఇప్పటికీ కాంగ్రెస్ సంస్కృతి, భావజాలమే ఉందని విమర్శించారు. పుట్టినరోజు నాడు కూడా జగన్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.
ప్రజల స్థలాను రక్షించడం కోసం, భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం 'స్వామిత్వ'ను ప్రవేశపెడితే.. దానికి 'వైయస్సార్ జగనన్న భూహక్కు-భూ రక్ష' అని పేరు మార్చి ప్రారంభోత్సవం చేయడం ఏంటి? అని ప్రశ్నించారు. పేర్లు మార్చి ప్రజలను ఎన్నాళ్ళు ఏమార్చగలరని నిలదీశారు. పథకానికి కనీసం ప్రధాని మోదీ ఫొటోను కూడా పెట్టరా? అని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలకు జగన్ సొంత పేరుని పెట్టుకోవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. గత ఆరేళ్ల పాలనలో ప్రధాని మోదీ వేలాది సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని.. కానీ, ఏ ఒక్క పథకానికి సొంత పేరును పెట్టుకోలేదని.. ప్రధానిని చూసి జగన్ నేర్చుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి హితవు పలికారు.