కొత్త కరోనా స్ట్రెయిన్ ఎఫెక్ట్.. రెండు రోజుల్లో 6 లక్షల కోట్లు ఢమాల్
posted on Dec 22, 2020 12:16PM
బ్రిటన్ లో కొత్త స్ట్రెయిన్ కరోనా వైరస్ బయటపడడంతో ప్రపంచం మొత్తం బెంబేలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మనకు తెలిసిన కరోనా తీరుకు ఈ కొత్త రకం భిన్నంగా ఉండటమేకాదు.. 70 శాతం వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండడంతో ప్రపంచం మొత్తం వణికిపోతోంది. దీంతో.. చాలా దేశాలు భయానికి గురై.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. నిన్నటి అమెరికా, యూరప్ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో, ఈరోజు ఆసియా మార్కెట్లు కూడా అదే బాట పట్టాయి. దీని ప్రభావం తాజాగా భారత్ స్టాక్ మార్కెట్ పై కూడా పడింది.
నిన్న భారీగా పతనమైన స్టాక్ మార్కెట్.. ఈరోజు ఉదయం 12.20 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టపోయి 0.60 శాతం నష్టంతో 45,240 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. దీంతో రెండు సెషన్ల వ్యవధిలోనే స్టాక్ మదుపరులు దాదాపు రూ. 6 లక్షల కోట్లను నష్టపోయినట్లయింది. ఇక ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ కూడా క్రితం ముగింపుతో పోలిస్తే, 0.76 శాతం పడిపోయి 13,220 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.