రాజ్యసభకు మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే!?

సెలబ్రిటీలను పార్టీలో చేర్చుకుని లబ్ధి పొందే విషయంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీలు పడుతున్నట్లు కనిపిస్తోంది. రాజ్యసభకు సెలబ్రిటీలను పంపించడం ద్వారా వారి గ్లామర్ ను, కరిష్మాను పార్టీ బలోపేతనికి వినియోగించుకునే విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాయి. ఈ కసరత్తులో భాగంగానే.. కర్నాటక నుంచి ఖాళీకానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకూ జరిగే ఎన్నికలలో పార్టీ తరఫున రంగంలోకి దించేందుకు సెలబ్రిటీల వేటలో పడ్డాయి.  క్రమంలో కాంగ్రెస్ తరఫున టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంటే.. బీజేపీ టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను రంగంలోకి దింపనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనిల్ కుంబ్లేతోనూ, బీజేపీ రాహుల్ ద్రావిడ్ తోనూ చర్చలు జరిపినట్లు సమాచారం. 

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అయితే ఇప్పటికే కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని డీకే శివకుమార్ స్వయంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ద్వారా సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. క్రికెటర్ గా దేశానికి, కర్నాటకకూ కుంబ్లే చేసిన సేవలను ప్రస్తుతించారు. అలాగే డీకేను తాను కలిసిన విషయాన్ని కుంబ్లే కూడా ధృవీకరించారు.  ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తరఫున కుంబ్లే రాజ్యసభకు పోటీ చేయడం ఖాయమన్న చర్చ జోరుగా సాగుతోంది. 

ఇక బీజేపీ విషయానికి వస్తే.. ఆ పార్టీ కూడా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను రాజ్యసభకు పంపేందుకు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు చెబుతున్నారు. ఇందుకు రాహుల్ ద్రావిడ్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.