విశాఖలో విప్రో ఎండీపై కేసు
posted on Apr 19, 2025 11:17AM

క్వాష్ చేయాలంటూ హైకోర్టుకు
ఈనెల 21వ తేదీన విచారణ
ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో ఎండీ సహా ఆ సంస్థకు చెందిన కొందరు ప్రతినిధులపై విశాఖలో కేసు నమోదైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లీజ్ అనుమతులు లేకుండా మరో ఐటీ కంపెనీకి భవనాన్ని లీజుకు ఇచ్చారంటూ వచ్చిన ఫిర్యాదు పై విశాఖలోని ద్వారక నగర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. విశాఖ నడిబొడ్డున రేసపువాని పాలెం వద్ద విప్రో కంపెనీ 6 అంతస్తుల భవనంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. ఈ దశలో ప్రభుత్వ సూచన మేరకు ఉద్యోగ కల్పన చేయకపోవడంతో ఆ భూమిని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయలేదు. కానీ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఈ దశలో విప్రో సంస్థ ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొనసాగుతున్న పల్సస్ సంస్థకు భవనంలోని మూడు అంతస్తులు లీజుకు ఇచ్చారు.
విప్రో సంస్థకు సంబంధించిన భవనంలోని సెకండ్ ఫ్లోర్ లో ఎస్ ఎఫ్ టి 37 రూపాయలు చొప్పున 37 75 చదరపు అడుగుల స్థలాన్ని 2019లో, అలాగే 2022 లో ఐదు, ఆరు అంతస్తులో చదరపు అడుగు 58 రూపాయలకు చొప్పున 35872 అడుగుల స్థలాన్ని, చదరపు గజం 38.85 రూపాయలకు 4877 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకి ఇచ్చారు ఈ మేరకు చెల్లింపులు కూడా జరుగుతున్నాయి. దీనిపై రిలీజ్ అగ్రిమెంట్ కోసం ఇటీవల విశాఖపట్నం సబ్ రిజిస్టర్ ను పల్సస్ సంస్థ ఆశ్రయించగా, అసలే ప్రభుత్వ నుంచి లీజు అగ్రిమెంట్ లేని సంస్థ మరో సంస్థకు లీజుకు ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
దీనిపై పల్సస్ సంస్థ తమను విప్రో సంస్థ మోసగించిందంటూ విప్రో ఎండి తో పాటు మరికొందరు ప్రతినిధులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ద్వారక నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కాగా ఈ విషయంపై విప్రో సంస్థ ఎండితో పాటు, ఇతరులు ఆ ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విప్రో ప్రతినిథుల పిటిషన్ ను హైకోర్టు ఈ నెల 21న విచారించనుంది.