ఒకే ఒక్కడు.. రాజాసింగ్!

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ  పరిధిలో మొత్తం 20 పైగా అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అయితే,అందులో బీజేపీ జెండా ఎగిరిన ఒకే ఒక్క నియోజక వర్గం గోషామహల్. ఈ నియోజక వర్గం నుంచి   ఎమ్మెల్యే రాజా సింగ్ ఒకసారి కాదు.. వరసగా మూడు సార్లు గెలిచారు. కేంద్ర హోం శాఖ సహయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నట్లుగా  రాజా సింగ్ కరుడు కట్టిన హిందుత్వవాది. అందులో సందేహం లేదు. అయితే, అది రాజా సింగ్’అనే నాణేనికి  ఒక పార్శ్వం మాత్రమే. ఆయనలో మరో పార్శ్వం కూడా వుంది.  అవును.. అనేక విషయాల్లో ఆయన పార్టీతో విభేదిస్తారు. అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్ రెడ్డి వ్యవహార సరళి ఆయనకు నచ్చదు. ఒక్క కిషన్ రెడ్డి అనే కాదు, పార్టీలో పాతుకు పోయిన నాయకులు ఆయనకు నచ్చరు. అయినా.. ఆయన బీజేపీని వదలరు. బీజేపీ ఆయన్ని వదలదు.

అవును.. గతంలో మునావర్‌ ఫారుఖీ షో’ ను వ్యతిరేకిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసింది. జైలుకు పంపింది. మరోవంక బీజేపీ జాతీయ నాయకత్వం ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.  అయినా సస్పెన్షన్  ను ఎత్తేసి గోషామహల్ నుంచి పోటీకు ఆయనకే పార్టీ టికెట్ ఇచ్చింది. గెలిచి మూడవ సారి ఎమ్మెల్యే అయ్యారు. నగరంలో బీజేపీకున్న ఏక్  అఖేలా ఎమ్మెల్యే ఆయనే.

అయినా.. శుక్రవారం ( ఏప్రిల్ 18) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై జరిగిన సమావేశానికి రాజాసింగ్ రాలేదు. నగరంలోని బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ రాకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది.  నిజానికి   కొద్ది రోజులుగా కిషన్‌ రెడ్డి, రాజాసింగ్ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే.  అయితే..  ఆయనలో ఎంత అసంతృప్తి ఉన్నా, ఆయనకు పార్టీ అంతగా సహకరించక పోయినా, 2018లో 2023లో వరసగా రెండు సార్లు నగరంలో బీజేపీ  జెండా ఎగరేసిన ఒకే ఒక్కడుగా  రాజా సింగ్.. నిలిచారు.   

అదలా ఉంటే.. హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో జరిగిన సమావేశంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు, ఎంఐఎంకు, ఒవైసీ సోదరులకు దాసోహం అంటున్నాయని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్దతుతోనే ఎంఐఎం రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తోందని, ప్రమాదకరంగా రజాకర్ల సంస్కృతిని విస్తరిస్తోందని అన్నారు. 
హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని కిషన్ రెడ్డి, కాంగ్రెస్,బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే.. బీజేపీ ఎదగకుండా చేయడమే ఆ మూడు పార్టీల లక్ష్యమని అన్నారు. 

కాగా, ఈ నెల  23న పోలింగ్ జరిగే  హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధి మీర్జా రియాజ్ ఉల్ హసన్  గెలుపు లాంఛనమే అంటున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు. బీజేపీ మాత్రం,ఎంఐఎం ఏకగ్రీవ ఎన్నికను అడ్డుకునేందుకు.. పార్టీ హైదరాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌతంరావును బరిలో దించింది.  అయితే.. గెలుపు ఎవరిదో ముందే తెలిసి పోయినా..  కమల దళం మాత్రం ఇంకా ఆశలు వదులుకున్నట్లు లేదు. అందుకే,  శుక్రవారం(ఏప్రిల్ 18) రోజంతా జరిగిన  హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో, ఒకే ఒక్కడు, ఒక్క రాజా సింగ్’ తప్ప  రాష్ట్ర, నగర ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఎందుకో?