రావ‌త్ అప్పుడు బ‌తికే ఉన్నారు.. మంచినీళ్లు అడిగారు.. ప్ర‌త్య‌క్ష సాక్షుల మాట‌ల్లో..

సీడీఎస్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి గురైంది. పొగ‌మంచు వ‌ల్ల కుప్ప‌కూలింద‌ని అంటున్నారు. ప్ర‌మాదంపై విచార‌ణ జ‌రిపించాల‌ని బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి డిమాండ్ చేశారు. పెద్ద కార‌ణాలు లేకుండానే.. ఆర్మీ హెలికాప్ట‌ర్ కూల‌డం.. అందులో సీడీఎస్ బిపిన్ రావ‌త్ మ‌ర‌ణించ‌డం సంచ‌లనంగా మారింది. గంట‌ల త‌ర‌బ‌డి ఆయ‌న మృతిపై ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇంత‌కీ.. ఆ స‌మ‌యంలో అక్క‌డ అస‌లేం జ‌రిగింది? ప్ర‌త్య‌క్ష సాక్షి ఎవ‌రైనా ఉన్నారా? ఉంటే, వారి వ‌ర్ష‌న్ ఇప్పుడు కీల‌కం కానుంది. 

హెలికాప్టర్‌ ప్రమాదం తర్వాత సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కొంతసేపు ప్రాణాలతో ఉన్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. తీవ్ర గాయాలతో ఉన్న ఓ వ్యక్తి తనను మంచినీళ్లు కావాలని అడిగారని, అయితే ఆయనే రావత్‌ అనే విషయం తనకు తర్వాత తెలిసిందని చెప్పారు. తమిళనాడులోని కున్నూరు సమీపంలో హెలికాప్టర్‌ కూలిన ఘటన, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులను కొందరు ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ఆ వివ‌రాలు వారి మాట‌ల్లోనే...

"మధ్యాహ్నం సమయంలో మేం పనిచేస్తున్న ప్రాంతానికి సమీపంలో భారీ శబ్దం వినిపించింది. అక్కడకు వెళ్లి చూస్తే ఓ హెలికాప్టర్ మంటల్లో కాలుతూ కన్పించింది. దట్టమైన పొగ రావడంతో ముందు మాకెవరూ కన్పించలేదు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో నేలపై పడి ఉన్నారు. మేం వారి దగ్గరకు వెళ్లాం. ఆ సమయంలో ఓ వ్యక్తి నన్ను మంచినీళ్లు కావాలని అడిగారు. మేం ఆయనను బెడ్‌షీట్‌ సాయంతో బయటకు లాగాం. ఆ తర్వాత రెస్క్యూ సిబ్బంది వచ్చి ఆయనను తీసుకెళ్లారు. నేను మాట్లాడిన వ్యక్తి సీడీఎస్‌ జనరల్‌ రావత్‌ అని నాకు తర్వాత కొందరు వ్యక్తులు చెప్పారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని అప్పుడే తెలిసింది. ఈ దేశం కోసం ఎంతగానో సేవ చేసిన వ్యక్తికి నేను మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయా" అని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. 

రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సరికి కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో ఉన్నట్లు సీనియర్ ఫైర్‌మ్యాన్‌ ఒకరు తెలిపారు. అందులో ఒకరు సీడీఎస్‌ రావత్‌ అని అన్నారు. ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా రక్షణశాఖ సిబ్బందికి లోగొంతుకతో తన పేరును చెప్పారని తెలిపారు. అయితే మార్గమధ్యలోనే ఆయన మరణించారని అన్నారు. గాయపడిన మరో వ్యక్తి గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్ అని గుర్తించేందుకు చాలా సమయం పట్టిందన్నారు.