ప్రమాదమా.. కుట్రా? బిపిన్ రావత్ మరణంపై సందేహాలు? 

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం దేశ ప్రజలను, ఆర్మీ వర్గాలను కలవరానికి గురి చేసింది.  అత్యంత భద్రత, సురక్షితమైనదిగా చెబుతున్న MI-17v5 హెలికాప్టర్ క్రాష్ కావడం నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. అదే సమయంలో హెలికాప్టర్ ప్రమాదంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించింది రష్య‌న్ మేడ్‌ అత్యంత సుర‌క్షిత‌మైన‌ హెలికాప్ట‌ర్‌. ప్ర‌ధాని మోదీ సైతం ప‌ర్య‌ట‌న‌ల‌కు ఎంఐ హెలికాప్ట‌రే వాడుతారు. ఈ హెలికాప్టర్‌కు ప్రత్యేకమైన రక్షణ కవచాలు అమర్చి ఉంటాయి. ఇన్ఫ్రారెడ్‌ సప్రెసర్లు, జామర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంధన ట్యాంక్‌ నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు ఉన్నాయి. సెల్ఫ్‌సీల్డ్‌ ట్యాంక్‌ పేలి మంటలు వ్యాపించకుండా పాలీయూరేథీన్‌ అనే సింథటిక్‌ ఫోమ్‌ రక్షణగా ఉంటుంది. అయినా కునూరు ఘ‌ట‌న‌లో హెలికాప్ట‌ర్ నుంచి మంట‌లు చెల‌రేగాయ‌ని అంటున్నారు.  

MI-17v5 హెలికాప్ట‌ర్‌లో అత్యాధునిక ఏవియానిక్స్‌ ఉండటంతో ఏ వాతావరణ ప‌రిస్థితుల్లో అయినా ఇది పనిచేయగలదు. అడవులు, సముద్ర జలాలు, ఎడారులపై సురక్షితంగా ప్రయాణించేలా దీనిని రూపొందించారు. 36 మంది సైనికులను లేదా 4.5 టన్నుల పేలోడ్‌ను తరలించగలదు. తాజా ఘ‌ట‌న‌లో బిపిన్ రావ‌త్‌తో స‌హా 14 మంది ప్ర‌యాణిస్తున్నారు. అంటే, ఇది ఓవ‌ర్ లోడ్ ఏమీ కాదు. ఈ హెలికాప్ట‌ర్‌ అత్యధికంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో 580 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఆర్మీ ఆప‌రేష‌న్స్‌తో పాటు ప్ర‌కృతి విప‌త్తులు, సహాయక చర్యల్లో కూడా దీనిని వినియోగిస్తున్నారు.  MI-17v5 సిరీస్‌ హెలికాప్ట‌ర్‌తో ఇప్పటి వరకు ఎలాంటి భారీ ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు ఏకంగా సీడీఎస్‌ ప్రయాణిస్తు హెలికాప్ట‌రే కుప్ప‌కూల‌డంతో కొన్ని వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోవడంపై సందేహాలు ఉన్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి చెప్పారు. ఈ హెలికాప్టర్‌గా చెప్తూ ప్రచారమవుతున్న వీడియోను తాను అత్యంత నమ్మదగిన వర్గాల ద్వారా సరిచూశానని, అది వాస్తవానికి సిరియన్ వైమానిక దళానికి చెందినదని, సీడీఎస్ ప్రయాణిస్తున్నది కాదని అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంపై వరుస ట్వీట్లు చేసిన సుబ్రమణ్య స్వామి..  సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరికొందరు సీనియర్ మిలిటరీ అధికారులు ఎలా మరణించారనేదానిపై సందేహాలు వస్తున్నాయన్నారు. ఈ సంఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు.

దేశ భద్రతకు ఇది చాలా పెద్ద హెచ్చరిక అన్నారు సుబ్రమణ్య స్వామి. తమిళనాడు వంటి సురక్షిత ప్రాంతంలో ఓ సైనిక హెలికాప్టర్ పేలిందని, అలా కనిపిస్తోందని అన్నారు. దీనిపై చాలా చాలా కట్టుదిట్టమైన దర్యాప్తు జరగాలని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి వంటివారి చేత విచారణ జరిపించాలని సుబ్రమణ్య స్వామి డిమాండ్ చేశారు.