జ‌న‌వ‌రి 9 నుండి ఆన్ లైన్‌లో శ్రీ‌వాణి ద‌ర్శన టికెట్లు

 

భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను జనవరి 9 నుండి రోజువారి ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించ‌నున్నారు.

ఈ మేరకు తిరుమలలో రోజువారి విధానంలో ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేస్తున్న 800 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్‌లైన్ ద్వారా రోజూవారి కరెంట్ బుకింగ్‌లోకి మార్చనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ పొందిన భ‌క్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

ఒక్క కుటుంబానికి 1+3 సభ్యులు (మొత్తం న‌లుగురు) మాత్రమే టికెట్ బుకింగ్‌కు అనుమతి ఉంటుంది. టికెట్ల బుకింగ్ లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరి. ఫ‌స్ట్ క‌మ్ ఫ‌స్ట్ స‌ర్వ‌డ్ విధానంలో భ‌క్తులు టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు. త‌ద్వారా ఆఫ్ లైన్ లో శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల కోసం భ‌క్తులు క్యూలైన్ లో నిరీక్షించే స‌మ‌స్య తొల‌గిపోతుంది. ఈ నూతన విధానాన్ని నెల రోజుల‌పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. 

అదేవిధంగా రోజుకు 500 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఇప్పటికే విడుద‌ల చేయ‌డం జరిగింది. మూడు నెల‌ల అనంత‌రం ఈ విధానంపై స‌మీక్షించి నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతుంది. తిరుప‌తి విమానాశ్ర‌యంలో ప్ర‌తిరోజూ భ‌క్తుల‌కు ఆఫ్ లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 టికెట్ల జారీ విధానం కూడా య‌థావిధిగా కొన‌సాగ‌నుంది.అన్ని వ‌ర్గాల భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకున్న నిర్ణ‌యాన్ని గ‌మ‌నించి భ‌క్తులు త‌మ ద‌ర్శ‌న ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిచుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేయ‌డ‌మైన‌ది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu