భార్యాభర్తలు కోపాన్ని మౌనంతో వ్యక్తం చేయడం మంచిదేనా?
posted on Jun 22, 2024 9:30AM
ప్రేమ ఉన్న చోట చిన్న చిన్న తగాదాలు కూడా ఉంటాయి. ఇవి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమను పెంచేలా పనిచేస్తాయి. అయితే ఈ చిన్న విషయాలు ఎప్పుడు ఇద్దరి బంధాన్ని పాడుచేస్తాయో కొన్నిసార్లు గుర్తించలేము. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కోపం తెచ్చుకుంటారు. కొందరు కేకలు వేస్తారు, కొందరు మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. కోపం రిలేషన్‌షిప్‌లో విబేధాలను సృష్టిస్తుంది. అయితే కొంతమంది తమ మాటల్లోనో, చర్యల్లోనో చూపించకుండా సింపుల్ గా మౌనాన్ని ఆశ్రయిస్తారు. కానీ ఇలా మౌనంగా ఉండటం అనేది కొన్నిసార్లు సంవత్సరాల బంధాన్ని కూడా విచ్చిన్నం చేస్తుందని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. అసలు మౌనం బంధం విడిపోవడానికి ఎలా కారణం అవుతుంది? తెలుసుకుంటే..
దంపతుల మధ్య గొడవలు వచ్చినప్పుడల్లా ఒకరు మాట్లాడటం మానేయడం తరచుగా కనిపిస్తుంది. ఇలాంటి వారిలో కోపం ఎంతగానో పెరిగిపోతుంది. ఇలాంటి వ్యక్తులు గొడవను పరిష్కరించడానికి ప్రయత్నం చెయ్యరు. అలాగని తిరిగి భాగస్వామితో మాట్లాడటానికి ఇష్టపడరు. ఇలా చేయడం వల్ల భాగస్వామి హృదయం గాయపడుతుంది. వారు ఒంటరితనం అనుభూతి చెందుతారు. దీని ప్రభావం వైవాహిక బంధం మీద ప్రభావం చూపుతుంది.
గొడవ జరిగినప్పుడు కోపాన్ని వ్యక్తం చెయ్యడానికి బదులు మౌనాన్ని ఆశ్రయించడం అనేది భావోద్వేగాలను తారుమారు చేస్తుంది. ఇది భార్యాభర్తల బంధంలో చాలా చెడ్డది. గొడవ జరిగిన ప్రతిసారీ ఇలాగే ప్రవర్తిస్తారేమోనని ఎదుటివారి మనసులో భయాన్ని కలిగిస్తుంది. ఈ ఆలోచన భాగస్వామిని చాలా బాధపెడుతుంది.
రిలేషన్ షిప్ లో గొడవలు వచ్చినప్పుడు సైలెంట్ గా ఉండడం మంచిది కాదు. ఇలా సైలెంట్ గా ఉండటం అనేది భాగస్వామిని అవమానపరిచినట్టే. ఇలా మౌనంగా మాట్లాడకుండా ఉండటం వల్ల భాగస్వామి తనను విడిచిపెట్టేస్తారేమో అనే భావన కలిగే అవకాశం ఉంది. మాట్లాడకుండా మౌనాన్ని ఆశ్రయించడం వల్ల ఎదుటివారి మనసులో అనేక రకాల ఆలోచనలు రావచ్చు. ఎదుటి వారు కూడా భాగస్వామి మాట్లాడకపోవడం వల్ల అతిగా ఆలోచించి తీవ్రమైన డిప్రెషన్, అనూహ్య నిర్ణయాలు తీసుకునే స్థితిలోకి జారుకోవచ్చు.
భార్యాభర్తలు ఎప్పుడూ కుటుంబ సభ్యుల కారణంగానో, స్నేహితుల కారణంగానో, ఆర్థిక విషయాల కారణంగానో, లేదా బయటి విషయాల కారణంగానో గొడవ పడి విడిపోవడం అనే చర్య వరకు వెళ్లకూడదు. భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాల్సినవారు. ఒకరి విషయంలో ఒకరికి మనస్పర్థలు ఉన్నా చర్చించి పరిష్కరించుకోవాలి. అలాంటిది ఇతరుల కారణంగా ఒకరితో ఒకరు మాట్లాడకపోవడం, ఒకరిని ఒకరు వదులుకోవడం అనే చర్య వరకు వెళ్ళడం మూర్ఖత్వం.
భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు భాగస్వామితో మాట్లాడటం మానేయడం లేదా మౌనంతోనే తమ నిరసన వ్యక్తం చేయడం వంటివి చేస్తుంటే అలాంటి అలవాటును వదిలేయడం మంచిది. భాగస్వాములు సుఖ దుఃఖాలలో మీకు తోడుగా నిలిచేవారని గుర్తుంచుకోవాలి. ఇద్దరి మధ్య మూడవ వ్యక్తి కారణంగా దూరం పెరుగుతుంటే ఆ వ్యక్తిని దూరంగా ఉంచాలి తప్ప మూడవ వ్యక్తి కోసం ఇద్దరూ గొడవ పడకూడదు. భాగస్వాములు ప్రేమ, ఆప్యాయత, సంరక్షణ, గౌరవం మొదలైనవాటికి అర్హులు. ఇద్దరూ కలసి మాట్లాడుకోవడం ద్వారా సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలి, దూరాన్ని తగ్గించుకోవాలి. ఇద్దరి మధ్య అందమైన బంధాన్ని మరింత బలపరుచుకోవాలి.
*రూపశ్రీ.