50 మంది విదేశీయులు అరెస్ట్.. హైదరాబాద్ లో కలకలం

హైదరాబాద్ లో విదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఫేక్ వీసాలతో ఇండియాకు వచ్చిన విదేశీయులు హైదరాబాద్ శివార్లలో తల దాచుకుంటున్నారని తెలుస్తోంది. చదువు కోసం వచ్చి కొందరు, టూరిస్టుల వీసాలతో వచ్చి మరికొందరు.. అక్రమంగా ఇక్కడే నివాసం ఉంటున్నారని సమాచారం. విదేశీయుల ద్వారానే డ్రగ్స్ రవాణా సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో 50 మంది విదేశీయులు పట్టుబడటం సంచలనం రేపుతోంది. 

నగర శివార్లలోని రాజేంద్రనగర్ బండ్లగూడలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. విదేశీయులే లక్ష్యంగా బండ్లగూడ, రాధానగర్‌ కాలనీలో 150 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. దాదారు 200 ఇండ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వీరంతా వీసా గడువు ముగిసినప్పటికీ దేశంలో అక్రమంగా ఉంటున్నారని పోలీసులు చెప్పారు. అయితే తామంతా విద్యార్థులమని, తమనెందుకు తీసుకెళ్తున్నారని విదేశీయులు పోలీసులతో గొడవకు దిగారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.