జగన్ పాలన వైఎస్ పేరుకు మచ్చ.. ఆత్మీయుల  ఆవేదన  

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, ఆ మాట కొస్తే జాతీయ రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అది ఆయన రాజకీయ ప్రత్యర్ధులు అయినా కాదనలేని నిజం. అప్పుడే కాదు, ఇప్పటికి  కూడా, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆయన్ని అభిమానించే నాయకులున్నారు. ఆదరించే జనం ఉన్నారు. నిజానికి, ఈరోజు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అయ్యారంటే అది అయన చలవే. జగన్ రెడ్డి, వైఎస్’ఆర్ పేరునే పార్టీ పేరుగా పెట్టుకున్నది కూడ అందుకే, వైఎస్ పేరును ఉపయోగించుకునే,జగన్ రెడ్డి  రాజకీయాల్లో నిలదొక్కుకున్నారు. ఆయన పేరు చెప్పుకునే ముఖ్యమంత్రి అయ్యారు.  అలాగే, వైఎస్ కుమార్తె షర్మిల సాహసించి తెలంగాణలో పార్టీ పెట్టారంటే అది కూడా, వైఎస్ పుణ్యమే. అందుకే ఆమె కూడా అన్న బాతాలోనే  ఆయన పేరునే (వైఎస్సార్ టీఎస్) రాజకీయ పార్టీ పెట్టారు. నిలదొక్కుకున్నారు. రాజన్నపాలన అనే ఏక వాక్య అజెండాతో ముందుకు సాగుతున్నారు. 

అయితే అదేమీ విచిత్రమో వైఎస్ ముఖ్య రాజకీయ సహచరులు ఎవరూ, జగన్ రెడ్డి వెంట రాలేదు. వైఎస్ ఆత్మ అనుకున్న, అయన జీవితకాల మిత్ర్ఫుడు, రాజకీయ సహచరుడు, కేవీపీ రామ చంద్ర రావు మొదలు, చివరు క్షణం వరకు అయన వెన్నంటి ఉన్న సూర్యుడు వరకూ ఏ ఒక్కరూ జగన్ రెడ్డి వెంట రాలేదు. అందుకు ఇతర కారణాలు ఏమున్నా, జగన్ రెడ్డి ఒంటెద్దు పోకడలు, రాజకీయ దురాస, అన్నిటినీ మించి తండ్రి శవం పక్కన పెట్టుకుని, ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేయడం ప్రధాన కారణమని అంటారు. అయినా, జగన్ రెడ్డి దూరంగా ఉన్నా లేక ఆయనే కొందరిని దూరంగా పెట్టినా, ఉండవల్లి అరుణ్ కుమార్  వైఎస్ సన్నిహితులు చాలా వరకు జగన్ రెడ్డిని, వైఎస్ కుమారుడు అన్న ఒకే ఒక్క కారణంగా  పరోక్షంగానే అయినా సమర్ధిస్తూ వచ్చారు. అయితే, 30 నెలల జగన్ రెడ్డి అరాచక పాలన చూసిన తర్వాత,ఇక ఉపేక్షించి లాభం లేదని, కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తించారు. కొద్ది రోజుల క్రితం, రాజశేఖర రెడ్డికి వీర్ విధేయుడుగా గుర్తింపు పొందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ రెడ్డి పాలన విఫలమయిందని విరుచుకు పడ్డారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. 

ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ కొత్త సంప్రదాయం ప్రారంభించిందని.. విపక్షం లేకుండా సభ నిర్వహించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లేనని అన్నారు. అంతేకాకుండా కేంద్రం షరతులకు అనుగుణంగా పన్నులు పెంచి అప్పులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని అప్పులపై నియంత్రణ లోపించిందని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి పాలనలో రెండేళ్ళలోనే, రూ.3 లక్షలకు పైబడి అప్పులు చేశారని, ముందు ముందు అప్పులు కూడా పుట్టని పరిస్థితి వస్తుందని ఉండవల్లి మండిపడ్డారు. జగన్ రెడ్డి పాలన ఇదే రీతిలో, ఇంతే సుందర ముదనష్టంగా సాగితే, రాష్ట్ర భవిష్యత్ మరిక లేవలేని స్థితికి చేరుకుంతుందని చాలా తీవ్రంగా హెచ్చరించారు. 

వైఎస్ మంత్రివర్గ సహచరుడు, డీఎల్ రవీంద్ర రెడ్డి అయితే, జగన్ రెడ్డి తండ్రి పేరును చెడగొడుతున్నారని  అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒకటికి రెండుసార్లు జగన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక విధానాలను తూర్పార పట్టిన, డీఎల్, తాజగా, రాజకీయ లబ్దికోసం ప్రతి పథకానికి వైయస్సార్ పేరు పెట్టి ఆయన పేరును చెడగొడుతున్నారని విమర్శించారు.గత ప్రభుత్వాలు పేద ప్రజల కట్టించి ఇచ్చిన ఇళ్ళకు, ఇప్పుడు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు  అంటూ, వన్ టైంమ్ సెటిల్’మెంట్ పేరున పేదల నుంచి వేలరూపాలు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. జగన్ రెడ్డి పాలనలో కేవలం కొంతమందికి మాత్రమే న్యాయం జరిగిందన్నారు. ప్రజలందరూ జగన్ పాలనలో ఓడిపోయారని రవీంద్రా రెడ్డి ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రి ఏది చెపితే దానికి తలలు ఊపుతూ అధికారులు సంతకాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పద్ధతిని మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెపుతారని డీఎల్ రవీంద్ర రెడ్డి జోస్యం చెప్పారు.

నిజానికి, ఒక్క ఉండవల్లి, ఒక్క డీఎల్ మాత్రమే కాదు, వైఎస్ తో కలిసి పనిచేసిన అనేకమంది, జగన్ రెడ్డి పరిపాలాన వైఎస్కు తలవంపులు తెచ్చేలా, ఆయన ఆత్మఘోషించే విధంగా ఉందని అంటున్నారు.