సారీనా? వ‌ర్రీనా? వంశీ వ్యూహ‌మేంటి? మ‌రో ముగ్గురి సంగ‌తేంటి?

నోటికొచ్చిన‌ట్టు కూశారు. అన‌రాని మాట‌లు అన్నారు. మీడియా మైక్ ముందు రెచ్చిపోయారు. అర్థంప‌ర్థం లేని నీచ ఆరోప‌ణ‌లు చేశారు. రాజ‌కీయంగా ఆదుకున్న అధినాయ‌కుడినే అవ‌మానించారు. ఆయ‌న అర్థాంగిపై అసంబ‌ద్ధ వ్యాఖ్య‌లు చేశారు. వ‌ల్ల‌భ‌నేని వంశీ నిప్పు రాజేస్తే.. కొడాలి నాని, అంబ‌టి రాంబాబు, ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిలు ఆ అగ్గి మ‌రింత రాజేశారు. చంద్ర‌బాబు వెక్కి వెక్కి ఏడ్చేలా చేశారు. ఆ త‌ర్వాత ఆ న‌లుగురు అబాసు పాల‌య్యారు. 

వారు చేసిన చెండాలానికి.. ప్ర‌జాగ్ని ఓ రేంజ్‌లో ఎగిసింది. భువ‌నేశ్వ‌రి మీద వాగిన వాగుడుకు.. అంతా దుమ్మెత్తిపోశారు. చీద‌రించుకున్నారు. అస‌హ్యించుకున్నారు. శాప‌నార్థాలు పెట్టారు. ఆందోళ‌న‌లు చేశారు. నిర‌స‌న‌ల‌కు దిగారు. ఆ ప్ర‌జా వ్య‌తిరేక‌త‌కు ఆ న‌లుగురిలో ఒక‌రు దిగొచ్చారు. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న‌ట్టు.. వ‌ల్ల‌భ‌నేని వంశీ సారీ చెప్పారు. క్ష‌మించండి అంటూ త‌ప్పుఒప్పుకున్నారు.

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై తాను పొరబాటున వ్యాఖ్యలు చేశానని.. అందుకు తాను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని, ఆత్మసాక్షిగా క్షమాపణలు తెలుపుకుంటున్నానని వల్లభనేని వంశీ అన్నారు. తాను భువనేశ్వరిని అక్కా అని పిలుస్తానని.. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని, తన నుంచి మరోసారి ఇలాంటి పొరబాటు వ్యాఖ్యలు రావని అన్నారు. ఆత్మ ప్రబోధానుసారం నిర్ణయం తీసుకున్నానని.. ఓ మీడియా ఛానెల్ డిస్కషన్ లో వల్లభనేని వంశీ.. చంద్రబాబు, భువనేశ్వరికి క్షమాపణలు చెప్పారు. కులం నుంచి వెలివేస్తారన్న కారణంతో తాను క్షమాపణలు చెప్పడం లేదంటూ కొస‌మెరుపు ఇచ్చారు. 

ఇంత‌కీ వంశీ త‌ప్పుతెలుసుకున్నారా? త‌ప్పు చేశారు కాబ‌ట్టే క్ష‌మాప‌ణ‌లు చెప్పారా? అంటే అనుమాన‌మే అంటున్నారు. వైసీపీ నేత‌లు బాగా ముదురు. జ‌గ‌న్ నుంచి షంటింగ్స్ ప‌డితేనో.. ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తేనో త‌ప్ప‌.. సారీ చెప్పే ర‌కం కాదు. భువ‌నేశ్వ‌రి విష‌యంలో అదే జ‌రిగింద‌ని చెబుతున్నారు. ప్ర‌జ‌ల నుంచి ఆ రేంజ్‌లో వ్య‌తిరేక‌త‌ను జ‌గ‌న్‌రెడ్డి ఊహించ‌లేక‌పోయారు. మొద‌ట్లో వారిని ఎంక‌రేజ్ చేసినా.. వెన‌కేసుకొచ్చినా.. ఆ త‌ర్వాత ఇదేదో తేడా కొట్టేలా ఉంద‌ని భ‌య‌ప‌డ్డారు. వెంట‌నే అంతా మౌన‌ముద్ర‌లోకి వెళ్లిపోయారు. అయినా, ఆ అప‌వాదు ఇంకా ర‌గులుతూనే ఉండ‌టంతో.. వైసీపీ అనుకూల ప్ర‌ముఖ ఛానెల్‌లో కావాల‌నే డిష్క‌ష‌న్ పెట్ట‌డం.. అందులో వంశీని గెస్ట్‌గా పిల‌వ‌డం.. ఆయ‌న‌తో సారీ చెప్పించ‌డం.. అంతా జ‌గ‌న్‌రెడ్డి స్క్రిప్ట్ ప్ర‌కారమే జ‌రిగింద‌ని అంటున్నారు. 

నిజంగా వారంతా త‌ప్పు చేసుకున్నామ‌ని అనుకుంటే.. ఆ న‌లుగురు క‌లిసి ప్రెస్‌మీట్ పెట్టి.. బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పి ఉంటే జ‌నం న‌మ్మేవారు. రాజ‌కీయంగా తీవ్ర‌ డ్యామేజ్ జ‌రుగుతోంది కాబ‌ట్టి.. వైసీపీ మ‌హిళ‌ల‌కు వ్య‌తిరేకం, ఆడ‌ప‌డుచుల‌ను కించ‌ప‌రుస్తోందంటూ ప్ర‌జ‌లు ర‌గిలిపోతున్నారు కాబ‌ట్టి.. ఇలా క్ష‌మాప‌ణ‌ల ప‌ర్వానికి తెర లేపారని భావిస్తున్నారు. క‌మ్మ కుల‌మంతా వ‌ల్ల‌భ‌నేని వంశీని వెలి వేసినంత ప‌ని చేయ‌డమూ ఆయ‌న దిగొచ్చేలా చేసింద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే టీడీపీ ఆధ్వ‌ర్యంలో ఆడ‌ప‌డుచుల ఆశీర్వాద యాత్ర‌ల‌కు చంద్ర‌బాబు శ్రీకారం చుట్ట‌నుండ‌ట‌మూ వైసీపీ నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింద‌ని చెబుతున్నారు. అందుకే, జ‌గ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కే.. వ‌ల్ల‌భ‌నేని వంశీతో త‌మ‌ అనుకూల‌ మీడియాలో సారీ చెప్పించి.. మ‌మ అనిపించి.. ఈ ఎపిసోడ్‌ను ముగించాల‌ని స్కెచ్ వేశార‌ని తెలుస్తోంది. కానీ, వంశీ క్ష‌మాప‌ణ‌లు చెబితే స‌రిపోతుందా? పోయిన ప‌రువు తిరిగి వ‌స్తుందా? నోరు పారేసుకున్న‌ మిగ‌తా ముగ్గురు నేత‌లు బ‌హిరంగంగా సారీ చెప్పే వ‌ర‌కూ వ‌దిలేది లేదంటున్నారు మ‌హిళాలోకం.