బాలినేనివి ఉత్తుత్తి బెదరింపులేనా?

వైసీపీలో టికెట్ల వ్యవహారం రోజు రోజుకూ పీటముడి పడుతోంది. ఒక వైపు జగన్ తన ప్రభుత్వంపై ప్రజలలో అపారమైన విశ్వాసం ఉందన్ని నమ్మకంగా చెబుతూ.. ఎమ్మెల్యేలపైనా వ్యతిరేకత అంటూ వారిని మార్చేస్తున్నారు. కొందరికి పార్టీ టికెట్లు నిరాకరిస్తూ, మరి కొందరిని సిట్టింగ్ స్థానాల నుంచి మార్చేస్తున్నారు. అలా టికెట్లు దక్కవని కన్ ఫర్మ్ అయిన వారు, నియోజకవర్గ మార్పును జీర్ణించుకోలేని వారు తమ అసంతృప్తిని, వ్యతిరేకతనూ జగన్ కు తెలియజేస్తున్నారు. కొందరు తిరుగుబాటు చేస్తుంటే, కొందరు పార్టీ వదిలేస్తున్నారు. ఇంకొందరు మీడియా సమావేశాలు పెట్టి మరీ జగన్ నిర్ణయంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మరింత గట్టిగా జగన్ ను సమర్ధిస్తూ ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా అయినా చివరి నిముషంలో అధినేత మనసు మార్చుకుని తమ స్థానం తమకు ఇస్తారన్న ఆశ వారిది. అయితే ప్రకాశం జిల్లా విషయంలో మాత్రం జగన్ కు కొరుకుడుపడని ఎమ్మెల్యేగా బాలినేని నిలుస్తున్నారు. 

 రెండేళ్ల కిందట బాలినేనిని జగన్ తన కేబినెట్ నుంచి తొలగించారు. అప్పటి నుంచీ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న బాలినేని అప్పటి నుంచీ వైసీపీ అధినేత జగన్ కు పంటికింద రాయిలా, చెవిలో జోరీగలా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. తెగించి బాలినేని పార్టీని వీడటం లేదు. అలాగని అణిగిమణిగి ఉండటం లేదు. రోజుకో విమర్శ, పూటకో డిమాండ్ తో జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.  చీటికీ మాటికీ జగన్ నిర్ణయాలను ప్రశ్నిస్తూ, విమర్శిస్తూ తన ధిక్కారాన్ని ప్రదర్శిస్తున్నారు.  రాజీనామా అంటూ బెదరింపులకు దిగుతున్నారు. అలా బాలినేని జగన్ ను ఇరుకున పెట్టడమే కాకుండా జిల్లాలో కూడా పార్టీపై, పార్టీ నిర్ణయాలపై అసంతృప్తిని రాజేస్తున్నారు. బాలినేని గట్టిగా గళమెత్తిన ప్రతి సందర్భంలోనూ ఆయనకు తాడేపల్లి నుంచి పిలుపు రావడం, బుజ్జగించడం షరామామూలుగా మారిపోయింది.  తాజాగా ప్రకాశం జిల్లాలో ఇన్ చార్జిల మార్పుపై బాలినేని తన అసంతృప్తిని మరో లెవెల్ కు తీసుకువెళ్లి వ్యక్తం చేశారు.  వైసీపీకి రాజీనామా చేయడం తనకు పెద్ద పనేం కాదనీ, చిటికెలో చేసేయగలనని వ్యాఖ్యానించారు. 

అయినా జగన్ బాలినేనిపై చర్య తీసుకునే సాహసం చేయడం లేదు. ఎందుకంటే బాలినేని జగన్ కు బంధువు. ఇప్పటికే కుటుంబం మొత్తం జగన్ కు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు బంధువును కూడా దూరం చేసుకుంటే ప్రతిష్ట మరింత మసకబారుతుంది. అందుకే బాలినేని విషయంలో జగన్ తన సహజ దూకుడును ప్రదర్శించకుండా, సంయమనం పాటిస్తున్నారు. 

బాలినేనిని తాజాగా పిలిచి మాట్లాడిన జగన్ ఆయన పోటీ చేసే స్థానాన్ని ఆయన్నే నిర్ణయించుకోమంటూ రెండు ఆప్షన్లు ఇచ్చారు. గిద్దలూరు లేదా ఒంగోలు నియోజకవర్గాలలో  ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్న నిర్ణయాన్ని బాలినేనికే వదిలేశారు. సహజంగానే బాలినేని తన సిట్టంగ్ స్థానాన్నే ఎంచుకున్నారు. అయితే అక్కడితో సరిపెట్టుకోని బాలినేని మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఒంగోలు లోక్ సభ స్థానం నుంచే బరిలోకి దింపాలని పట్టుబడుతున్నారు. అందుకు జగన్ ససేమిరా అనడంతో మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా బెదరింపునకు దిగారు.   మరి ఈ సారి బెదరింపునకు జగన్ దిగి వచ్చి మాగుంటకు ఒంగోలు లోక్ సభ స్థానం కేటాయిస్తారా? లేదా అన్నది చూడాలి. మాగుంటను ఒక వేళ పక్కన పెట్టేస్తే బాలినేని తాను చెప్పినట్లు రాజీనామా చేస్తారా.. లేక తనవి ఉట్టుట్టి బెదిరింపులేనని మరో మారు రుజువు చేస్తూ తన సిట్టింగ్ స్థానం తనకు దక్కింది చాలని సరిపెట్టుకుంటారా? చేడాల్సి ఉంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu