వైసీపీకి గుమ్మనూరు జయరాం రాంరాం!
posted on Jan 24, 2024 5:29PM
సీనియర్లను పోటీ చేయమంటే వద్దు వద్దంటున్నారు. సిట్టింగుల సీటు మారిస్తే పార్టీకి గుడ్ బై అంటున్నారు. కోరుకున్న స్థానంలో అవకాశం లభించిన వారు కూడా వద్దు బాబోయ్ అంటూ పారిపోతున్నారు. సరిగ్గా ఎన్నికలకు నెలల ముందర ఏపీలో అధికార వైసీపీ పరిస్థితి ఇది. నిజమే తాజాగా మంత్రి గుమ్మలూరు కూడా పార్టీ వీడేందుకు రెడీ అయిపోయారు.
ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాదని ఆయను కర్నూలు లోక్ సభ స్థానానికి పోటీ చే యమని ఆదేశించారు. అందుకు నిరాకరించిన ఆయన పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆలూరుకు కొత్త ఇంచార్జిని ప్రకటించి నతర్వాత గుమ్మనూరు జయరాం నియోజకవర్గానికి వచ్చి పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆలూరును విడిచి వెళ్లేది లేదని కుండబద్దలు కొట్టేశారు. ఆ తరువాత ఆయన కొద్ది రోజుల పాటు పార్టీ వారికి ఎవరికీ అందుబాటులో లేకుండా బెంగళూరుకు వెళ్లి పోయారు. ఆ తరువాత తిరిగి ఆలూరు వచ్చినా వైసీపీ నేతలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు.
వైసీపీ ఆలూరు తాజా అభ్యర్థి విరుపాక్షి కలిసేందుకు ప్రయత్నించినా ఆయన అది పడనివ్వలేదు. ఇక వైసీపీ ముఖ్యనేతలు వచ్చినా వారిని కలిసేందుకు ఆయన సుముఖత చూపలేదు. గతంలో టీడీపీలో క్రియాశీలంగా పని చేసిన గుమ్మనూరు జయరాం తిరిగి రావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని చెబుతున్నారు. ఆయనను చేర్చుకోవడానికి తెలుగుదేశం పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ లో చేరే ప్రయత్నాలలో భాగంగానే ఆయన బెంగళూరు వెళ్లారని గుమ్మనూరు జయరాం సన్నిహితులు చెబుతున్నారు.
ఆయన బెంగళూరులో కర్నాటక మంత్రి నాగేంద్ర ద్వారా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారనీ, ఆ భేటీలో కాంగ్రెస్ లో చేరికకు రూట్ క్లియర్ చేసుకున్ారని చెబుతున్నారు. కర్ణాటక మంత్రి నాగేంద్ర బంధువు కావడంతో డీకేతో భేటీకి మార్గం సుగమమైందనీ, త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఆలూరు నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.