సీమలో బాలయ్య యాత్ర

ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీమ యాత్రకు రెడీ అవుతున్నారు.   రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలో  ఈ ఏడాది చివరలో ప్రారంభమైయ్యే బాలయ్య యాత్ర ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందుపురం నియోజకవర్గం రాయలసీమలోనే ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయనను  ఆ నియోజకవర్గానికే పరిమితం చేయకుండా.. సీమలోని మొత్తం అన్ని జిల్లాల్లో బాలయ్య యాత్ర చేసే విధంగా ప్రణాళికలు సిద్దమైనట్లు సమాచారం. 

అదీకాక రాయలసీమలో బాలకృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది.. ఆయన నటించిన అన్ని చిత్రాలూ ఇక్కడ రికార్డులు బద్దలు కొట్టిన విషయం విదితమే. అలాంటి రాయలసీమలో మొత్తం 52 నియోజకవర్గాలు ఉన్నాయి.  2019 ఎన్నికల్లో  ముచ్చటగా.. మూడంటే మూడు స్థానాలు మాత్రమే తెలుుదేశం ఖాతాలో పడగా మిగిలిన 49 స్థానాల్లో   జగన్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.   

ప్రస్తుతం వైయస్ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నది సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకతను  పార్టీ వైపునకు.. అదీ కూడా బలంగా తిప్పుకోవాలంటే.. బాలయ్య లాంటి మాస్ క్రేజీ ఉన్న హీరోతో యాత్ర చేస్తే తెలుగుదేశం విజయం  నల్లేరు మీద నడకే అవుతుందన్న విశ్వాసం పార్టీ అధిష్ఠానంల  ఉందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  మరో వైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఇప్పటికే యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర.. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలను చుట్టేసి... ప్రస్తుతం సీఎం జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో సాగుతొంది.

ఈ జిల్లాలో లోకేష్ యాత్ర.. మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది.  నారా లోకేష్ పాదయాత్రకు.. సీమలోని అన్ని జిల్లాలోని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్న విషయ విదితమే. ఆ క్రమంలో ఎన్నికలకు ముందు అంటే ఈ ఏడాది చివరలో అంటే.. నవంబర్, డిసెంబర్‌ మాసాల్లో బాలయ్య బాబు .. సీమలో ఈ యాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని సమాచారం.        

అయితే వచ్చే ఎన్నికల్లో సైకిల్ పార్టీని సవారీ తీయించేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో పార్టీని గెలిపించి.. అధికారం చేపట్టడం కోసం ఆయన తన చాణక్యానికి మరింత పదును పెడుతున్నారు. అందులోభాగంగా వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన ప్రజల్లోకి వెళ్లి తనదైన శైలిలో గళం విప్పుతోన్నారు. ఆ క్రమంలో బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి తదితర కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు.

వీటిని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆయన నిర్వహిస్తుండగా... వీటికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్న విషయం విదితమే. అలాగే మీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అటు ప్రజలకు, ఇటు యువతకు భరోసా ఇచ్చేందుకు మరో కార్యక్రమాన్ని సైతం చంద్రబాబు చుట్టనున్నారు. ఓ వైపు నారా లోకేశ్, మరోవైపు చంద్రబాబు, ఇంకోవైపు నందమూరి బాలకృష్ణ.. ఇలా తలా వైపు నుంచి జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పుతూ... ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. 

అలాగే రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారానికి నందమూరి ఫ్యామిలీ నుంచి చైతన్యకృష్ణ, రామకృష్ణలు, నందమూరి సుహాసిని తదితరులు సైతం వస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీని వరిస్తుందనే అంశంపై తెలుగు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.