ఆటో సేవలో పథకం లబ్ధిదారులు ఎందరంటే?
posted on Oct 4, 2025 10:09AM

రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. రాష్ట్రంలో స్త్రీ శక్తి' పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లకు అండగా నిలిచే లక్ష్యంగా ఆటో డ్రైవర్ల సేవలో అనే కొత్త పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఆటో, క్యాబ్ డ్రైవర్‌కు రూ.15,000 ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తమకు ఆదాయం గణనీయంగా తగ్గిపోయి, కుటుంబ పోషణ కష్టంగా మారిందన్న ఆటో, క్యాబ్ ట్యాక్సీ డ్రైవర్ల ఆవేదనను పరిగణనలోనికి తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ఆదుకునేందుకు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకానికి శుక్రవారం (అక్టోబర్ 3) జరిగిన కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది. దీంతో ఈ పథకం పట్టాలెక్కింది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరయ్యారు. ఈ పథకం కింద రా ష్ట్ర వ్యాప్తంగా 2,90,669 మంది డ్రైవర్లు లబ్ధి పొందుతారు.