కేజ్రీవాల్ కొత్త క్రేజీ థాట్.. లెర్నింగ్ లైసెన్స్ రద్దు..!

 

ఢిల్లీలోని వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సరి, బేసి విధానాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ క్రేజీ ఆలోచనకు బాగానే మార్కులు పడ్డాయి. ఇప్పుడు కేజ్రీవాల్ మరో క్రేజీ ఆలోచనను అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇకనుండి ఢిల్లీ పరిధిలో లెర్నింగ్ లైసెన్స్ విధానాన్ని తొలగించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ట్రాన్స్ పోర్ట్ కార్యాలయాల్లో అవినీతి పెచ్చు మీరిందని.. అధికంగా ముడుపులు చెల్లించాల్సి వస్తుందని.. అనేక ఫిర్యాదులు వచ్చిన పిమ్మట కేజ్రీవాల్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించగా.. ఆయన కూడా దానికి అనుకూలంగానే స్పందిచారని..  మంచి ఆలోచనేనని అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. చదువుకున్న వారికి రవాణా నిబంధనల గురించి తెలుసునని, వారికి లెర్నింగ్ లైసెన్స్ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కేజ్రీవాల్ ప్రతిపాదనను కొంత మంది అధికారులు మాత్రం వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.