పేరుకుపోయిన బకాయిలు.. తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్!

పేదలు సంజీవినిగా భావించే ఆరోగ్య శ్రీ సేవలు తెలంగాణలో పూర్తిగా నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ బకాయిలను చెల్లించకపోవడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో వేయి కోట్ల రూపాయలకు పైగా ఆరోగ్య శ్రీ బకాయిలు పేరుకుపోవడంతో ఈ పథకం కింద వైద్య సేవలు అందించడం తమ వల్ల కాదని తెలంగాణ నెట్ వర్క్ ఆస్పత్రిలు చేతులెత్తేశాయి. గత కొంత కాలంగా తెలంగాణ నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ బకాయిల గురించి ప్రభుత్వానికి నివేదిస్తూనే ఉంది. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో తెలంగాణ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసింది. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయి పది రోజులకు పైగా గడిచినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో  రాష్ట్రంలో పేదల రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

రేవంత్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత చాలా ఆర్భాటంగా ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవల పరిమితిని పదిలక్షల రూపాయలకు పెంచింది. అయితే దాని వల్ల ఉపయోగం ఏముందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ వైద్య సేవల పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచినట్లు గొప్పగా ప్రకటించిన రేవంత్ సర్కార్ పేరుకుపోయిన బకాయిలను పట్టించుకోకపోవడం వల్ల పరిమితి పెంపు ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఈ పథకం కింద వైద్య సేవలు నిలిచిపోయి పది రోజులు గడిచిపోయినా, పేరుకుపోయిన బకాయిల విడుదల ఊసెత్తకుండా, అసలు నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తో చర్చలు కూడా జరపకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క ఆరోగ్యశ్రీతో పాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం, జర్నలిస్ట్ హెల్త్ స్కీం లు కూడా పని చేయడం లేదని, ఆయా కార్డుల పరిస్థితి విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అన్నట్లుగా తరయారయ్యాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, పేద ప్రజలకు శాపంగా మారిందని వైద్యఆరోగ్య శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయక పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిన దుస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. హరీష్ వ్యాఖ్యలపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రస్తుత పరిస్థితికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ప్రతి విమర్శ చేశారు.  రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు మాని రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.