ఆ ప్రచారం ఆపండి.. పార్టీ నేతలకు తెలుగుదేశం హైకమాండ్ ఆదేశం

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలంటూ పార్టీ నేతలూ, కార్యకర్తల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రచారానికి తెలుగుదేశం అధిష్ఠానం చెక్ పెట్టింది. ఇకపై ఎవరూ నారా లోకేష్ కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ అంటూ వ్యాఖ్యలు, డిమాండ్లూ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనవసర అంశాలను మీడియా ముందు లేవనెత్తవద్దని పేర్కొంది.  నారా లోకేష్ డిప్యూటీ సీఎం అన్న అంశంపై పార్టీ నాయకులు ఎవరూ బహిరంగంగా, లేదా  మీడియా ముందు మాట్లాడవద్దని ఆదేశించింది. ఏ విషయమైనా కూటమి అధినేతలు చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. 

ఇటీవల కొంత కాలంగా తెలుగుదేశం కీల‌క నేత‌లు బ‌హిరంగంగానే లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ బహిరంగంగానే మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.  తెలుగుదేశం అధికార ప్ర‌తినిధి మ‌హాసేన రాజేశ్, పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు శ్రీ‌నివాస్ రెడ్డితోపాటు డిప్యూటీ స్పీక‌ర్ గా ఉన్న ర‌ఘురామ కృష్ణరాజు, ఫిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ,  సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలా ప‌లువురు నేత‌లు ఒక్కొక్క‌రుగా నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ చేయాల‌ని కోరుతున్నారు. ఇటీవ‌ల మైదుకూరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశీనులైన స‌భావేదిక‌పైనే శ్రీ‌నివాస్ రెడ్డి లోకేశ్ ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. దీనిపైనే తెలుగుదేశం హైకమాండ్ సీరియస్ గా స్పందించింది. అనవసర విషయాలు మీడియా ముందు లేవనెత్తవద్దనీ, లోకేష్ డిప్యూటీ సీఎం అన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలనీ విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.