అమరవీరుల జెండా వందనం.. సాయుధ దళాల జెండా దినోత్సవం -2024..


సాయుధ దళాల జెండా దినోత్సవం 2024 మనం రోజూ అనుభవించే ఎన్నో సౌకర్యాలు, సుఖాలు  ఉండకపోయినా,  రాత్రనక, పగలనక  గడ్డ కట్టించే మంచుపర్వతాలలో, మండించే ఎడారిలో పనిచేస్తున్న ఆర్మీ,  తీరప్రాంతానికి ఏ ప్రమాదం చేరకుండా సముద్రం  మద్యలో అడ్డుగోడలా నిలబడి రక్షిస్తున్న నేవీ,  దేశ రక్షణ కోసం గగన మార్గంలో కూడా డేగ కళ్ళతో తిరుగుతూ ఏ ప్రమాదమూ మన దేశపునెత్తి మీద పడకుండా రక్షిస్తున్న ఎయిర్ఫోర్సుల్లో  ప్రతీ  సైనికుడు నిస్వార్ధంగా పనిచేస్తున్నాడు అంటే దానికి కారణం, వాళ్ళు ఈ దేశాన్ని ఒక తల్లిగా,  దేశంలోని పౌరులందరినీ  తమ కుటుంబంగా  భావించి,  మనల్ని  ఇంట్లో సుఖంగా పడుకోనిస్తూ,  వాళ్ళుమాత్రం  ఇంటి బయట అహర్నిశలు కాపు కాస్తున్నారు.    
 అలా నిస్వార్ధంగా, నిర్భయంగా  మనందరి కోసం ప్రతీ సైనికుడు అక్కడ పనిచేస్తున్నారు అంటే, వారి వెనుక త్యాగం చేసే ఒక కుటుంబం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబం దేశం కోసం తన బిడ్డని సమర్పించింది. మరి అలాంటప్పుడు ఆ సైనికుడి మీదైనా, అతని కుటుంబం మీదైనా బాధ్యత  మనందరికీ  ఉంటుంది. ఒక సైనికుడికి  కష్టం వస్తే దేశమంతా ఏకమై కుటుంబంలా నిలబడుతుందన్న నమ్మకాన్ని  సైనికుల్లో కలిగించటానికి, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ,  ఒక కుటుంబంగా వారికి అండగా నిలబడటానికి ఈ సాయుధ దళ దినోత్సవం జరుపుకోవటం మొదలుపెట్టారు. 

సాయుధ దళాల జెండా దినోత్సవం: చరిత్ర

భారత సాయుధ దళాలయిన   ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులో చేరి,  మన దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడుతున్న, పోరాడి అమరులయిన  సైనికులను  గౌరవించడానికి సాయుధ దళాల జెండా దినోత్సవం జరుపుకుంటారు. సైనిక సిబ్బంది, వారి కుటుంబ  సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి సాయుధ దళాల జెండా దినోత్సవం జరపటమనేది డిసెంబర్ 7, 1949 నుంచి మొదలైంది. ఈ రోజున  దేశంలోని శాంతి, స్వేచ్ఛ,  భద్రతను కాపాడడంలో సైనికులు చేసిన  త్యాగాలను, దేశ రక్షణలో  వారికున్న అంకితభావాన్ని గుర్తించి, గౌరవిస్తారు.  అదనంగా, వారి  సంక్షేమానికి నిధులను సమీకరించడం జరుగుతుంది. 

సాయుధ దళాల జెండా దినోత్సవం ప్రాముఖ్యత: 

ప్రత్యేకమైన ఈరోజున  పౌరులంతా,   రక్షణ దళాలు, వారి కుటుంబాల పట్ల తమకున్న  కృతజ్ఞతను వ్యక్తపరిచే అవకాశం పొందుతారు. ఈ రోజున అందించే దేశ పౌరులు వివిధ రూపాల్లో  అందించే విరాళాలను  మాజీ  సైనికులు, యుద్ధ వితంతువులు, వికలాంగులైన సైనికుల  పరిస్థితిని మెరుగుపర్చటానికి ఉపయోగిస్తారు. ఇలాంటి ఒక దినోత్సవం జరుపుకోవటం వల్ల  సైనిక సిబ్బందికి,  పౌరులకి  మధ్య ఉన్న బంధం  బలోపేతం అవుతుంది.   పౌరులందరిలోనూ  ఐక్యత, దేశభక్తి భావనలను ప్రోత్సహిస్తుంది.  


సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారు?

భారత సైనిక సిబ్బంది సాంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, ఉత్సవాలు, ఇతర వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా రెడ్, బ్లూ, లైట్ బ్లూ  రంగులతో కూడిన త్రివర్ణ జెండాలు (భారత సైన్యం యొక్క మూడు విభాగాలను సూచిస్తూ) పంపిణీ చేస్తారు. పౌరులంతా  ఈ జెండాలను ధరించడం వీరులను గౌరవించడానికి ఒక  ప్రతీక అవుతుంది. 

ప్రధాన లక్ష్యాలు:
1.    భారత సాయుధ దళాల అంకితభావం,  త్యాగాలను గుర్తించి, గౌరవించటం. 
2.    అమరవీరుల కుటుంబాలు, మాజీ సైనికులు,  దివ్యాంగ సైనికుల సంక్షేమం కోసం నిధులను సమీకరించడం.
3.    దేశ రక్షణలో పాల్గొనే వారికి మద్దతు అందించడంలో పౌరుల బాధ్యతను ప్రేరేపించడం.

సాయుధ దళాల జెండా దినోత్సవ నిధి : 


 రక్షణ మంత్రిత్వ శాఖ కమిటీ,  1949లో సాయుధ దళాల జెండా దినోత్సవ నిధిని సృష్టించింది. 1993లో, యుద్ధ బలిదాన దాతల నిధి, కేంద్ర సైనిక్ బోర్డ్ నిధి, మాజీ సైనికుల సంక్షేమ నిధి, ఇతర విభాగాలకు సంబంధించిన నిధులన్నింటినీ కలిపి ఒకే నిధిగా, ‘సాయుధ దళాల జెండా దినోత్సవ నిధి’గా మార్చింది.
 
నిధి ఉపయోగాలు:

•    అమరవీరుల కుటుంబాలకి, యుద్ధంలో గాయపడి  వికలాంగులైన   సైనికులకు మద్దతు ఇస్తారు. 
•    మాజీ సైనికుల జీవన పరిస్థితి మెరుగుపర్చటానికి  ఆర్థిక సహాయం అందిస్తారు.
•    సైనికుల పిల్లల విద్యకు అవసరమైన ఆర్థిక సహాయం చేసి, వారి భవిష్యత్తుకి భరోసా ఇస్తారు.   

అయితే ఈ ‘సాయుధ దళాల జెండా దినోత్సవం’ అనేది కేవలం ఆర్థిక మద్దతు ఇవ్వడానికి మాత్రమే కాదు,   ఇది ఐక్యత, గౌరవం, జాతీయ గర్వానికి ప్రతీక. ఈ రోజున పౌరులు సైనికుల సంక్షేమంలో అందరూ చురుకుగా పాల్గొని, దేశం కోసం  త్యాగాలు చేసిన వీరుల పట్ల తమ కృతజ్ఞతను వ్యక్తం చేయటం గొప్ప విషయం. మనల్ని తమ కుటుంబంగా భావించి కాపాడుతున్న ప్రతీ వీర సైనికుడిని, మనం కూడా  మన ఇంటి బిడ్డగా భావించి వారి కష్ట, నష్టాల్లో పాలుపంచుకుని, అందరం ఐకమత్యంగా ఉందాం. అప్పుడే మన భారతదేశానికున్న   వసుదైక కుటుంబ భావనని నిలబెట్టినవాళ్ళమవుతాం. 

                                         *రూపశ్రీ .
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu