అతిగా ఆలోచించేవాళ్లకు భలే సొల్యూషన్.. 5-5-5 టెక్నిక్ గురించి తెలుసుకోండి..!


అతి సర్వత్రా వర్జయేత్  అని అన్నారు పెద్దలు.  అంటే అతిగా ఏం చేసినా అది నష్టాన్నే కలిగిస్తుంది అని. అతిగా తినడం, తాగడం, ఏదైనా పని చేయడం,  నిద్రపోవడం.. ఇలా ఒకటని కాదు.. అతిగా ఏం చేసినా దానివల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. మరీ ముఖ్యంగా అతిగా ఆలోచించడం,  అతిగా స్పందించడం కూడా చాలా నష్టాన్ని కలిగించే అలవాట్లే.. కానీ చాలామందికి తెలియదు.. తాము అతిగా ఆలోచిస్తున్నామని, అతిగా రియాక్ట్ అవుతున్నామని.  జరగాల్సిన నష్టం జరిగినప్పుడు కూడా వెంటనే తాము అతిగా రియాక్ట్ అయ్యాం అని, అతిగా ఆలోచించాం అని వారు తెలుసుకోరు. అయితే ఈ అతిని అరికట్టడానికి ఒక సింపుల్ టెక్నిక్ చెబుతున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు. అదే 5-5-5 టెక్నిక్.. ఇంతకీ ఇదేంటో.. ఇదెలా పని చేస్తుందో తెలుసుకుంటే..


5-5-5 టెక్నిక్..

సోషల్ మీడియాలో ఈ నెంబర్స్ తాలూకు టెక్నిక్స్ చాలా ట్రెండ్ అవుతూ ఉంటాయి. వాటిలో పిట్నెస్ కు సంబంధించినవి చాలా ఎక్కువ ఉంటాయి. అయితే అవి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన టెక్నిక్ ఏదైనా ఉందంటే అదే 5-5-5..

 5-5-5 రూల్ ఇదే..

ఈ టెక్నిక్ లో రూల్ ను రివీల్ చేసేవి ఈ నెంబర్స్ ఏ. ఏదైనా ఒక పని  చేయడానికి ముందు లేదా ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకునే ముందు, ఇతరుల దగ్గర ఏ విషయం గురించి అయినా స్పందించాలని అనుకునే ముందు 5 నిమిషాలు ఆలోచించాలని చెబుతున్నారు. అంతేకాదు.. 5 నిమిషాల తర్వాత ఈ విషయం 5 రోజులు లేదా 5 ఏళ్ళ తర్వాత కూడా నాకు ముఖ్యమా? అనే విషయాన్ని ఆలోచించాలని చెబుతున్నారు.

ఇలా ఆలోంచించడం వల్ల మనసును నెమ్మది చేయవచ్చు. ఏదైనా పని చేసే ముందు లేదా ఆలోచించి నిర్ణయం తీసుకునే ముందు,  ఏదైనా మాట్లాడే ముందు ఇలా 5 నిమిషాల సమయం తీసుకోవడం వల్ల బావోద్వేగాన్ని చాలా వరకు నియంత్రణలో ఉంచవచ్చు.

ఇది5 నిమిషాల తర్వాత ముఖ్యమా? 5 రోజుల తర్వాత కూడా ముఖ్యమా? 5ఏళ్ల తర్వాత కూడా ముఖ్యమైనదేనా? అనే విషయాలు ఆలోచించడం వల్ల చేయాలనుకున్న పని లేదా మాట్లాడాలి అనుకున్న మాట తాత్కాలిక విషయమా లేదా జీవితానికి సంబంధించినదా? దాని ప్రయోజనం ఏంటి? నష్టం ఏంటి అనే విషయాలు బాగా అర్థమవుతాయి.

5-5-5 టెక్నిక్ పాటించినప్పుడు,  ఆ టెక్నిక్ పాటించకుండా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి. వాటి మధ్య తేడా ఏంటి అనేది స్పష్టంగా అర్థం చేసుకుని తమను తాము మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది.

                                   *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu