హ్యాపీ మెన్స్ డే.. బాధ్యతను, ప్రేమను నిశ్శబ్దంగా మోసే వీరులు పురుషులు..!


ప్రపంచంలో ప్రతి మనిషి తన తన పాత్రలతో, బాధ్యతలతో జీవనం కొనసాగిస్తాడు. అందులో పురుషుల పాత్ర ప్రత్యేకం. కుటుంబం, సమాజం, వృత్తి ఈ మూడు రంగాలలోనూ పురుషులు  నిశ్శబ్దంగా, కనిపించని ఒత్తిడులను భరిస్తూ సాగుతుంటారు. ఈ నిశ్శబ్ద పోరాటాన్ని గుర్తించేందుకు  అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటారు.  ప్రతి సంవత్సరం నవంబర్ 19న పురుషుల దినోత్సవం జరుపుకుంటారు. సాధారణంగా సమాజంలో మహిళా దినోత్సవానికి ఇచ్చిన ప్రాధాన్యత,  గుర్తింపు.. పురుషుల దినోత్సవానికి లేదనే చెప్పాలి. అసలు పురుషుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? సమాజ పరంగా, కుటుంబ పరంగా పురుషుల పాత్ర గురించి  తెలుసుకుంటే..

అనేక సందర్భాల్లో పురుషుల భావోద్వేగాలు, మానసిక ఒత్తిడులు, ఆరోగ్య సమస్యలకు ప్రాధాన్యత ఉండదు.  మగవాళ్లు బలవంతులు అనే చిన్న మాటతో మగవారిని భావోద్వేగ పరంగా అణిచివేస్తూ ఉంటారు.  ఈ కారణంగానే చాలామంది మగవారు కఠినంగా కనిపిస్తారు. కానీ మగవారు కూడా మనుషులే..  వారికి మనసు ఉంటుంది. వారు మానసికంగా భావోద్వేగాలు కలిగి ఉంటారు.  ముఖ్యంగా పురుషుల దినోత్సవం సందర్భంగా పురుషులు తెలుసుకోవలసిన,  పురుషుల విషయంలో అందరూ తీసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి.

పురుషుల కోసం..

పురుషుల మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం.  మగవాడు అనే పేరుతో బావోద్వేగాలను అణిచివేయకూడదు.

పురుషులు ఈ సమాజంలో కీలక పాత్ర పోషిస్తారు.   వారి వల్ల ఈ సమాజంలో జరుగుతున్న మార్పులు, వారు సామాజికంగా చేస్తున్న కృషిని గుర్తించడం.

ప్రతి కుటుంబంలో పురుషులు కీలకంగా ఉంటారు.  కుటుంబంలో తండ్రిగా, అన్నగా, భర్తగా లేదా కొడుకుగా  వారి పాత్రలు చాలా శక్తివంతమైనవి.  భారతీయ కుటుంబాలు పురుషులను ఇంటిపెద్దగా,  కుటుంబ బాధ్యతలను మోసే వ్యక్తిగా తీర్చిదిద్దాయి.  అందుకే కుటుంబ పరంగా పురుషులను గౌరవించడం ముఖ్యం.

సమానత్వం అంటే మహిళలకే కాదు, పురుషులకు కూడా అవసరమే. పురుషులు కూడా సమానత్వం పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు.  ఈ విషయాన్ని గుర్తించి పురుషులందరిని గౌరవించాలి.

పురుషుడంటే కేవలం బాధ్యతలు మోసే వ్యక్తి మాత్రమే కాదు..  మగవారిని  తరచుగా బాధ్యతల బరువుతో కొలుస్తారు. కానీ ప్రతి మగవాడికి  అనుభవాలుంటాయి, కష్టాలుంటాయి, కలలుంటాయి. వారు కూడా  నవ్వుతార, బాధపడతారు, భయపడతారు—కానీ చాలా సార్లు ఇవన్నీ లోపలే దాచుకుంటాడు. బయటకు వ్యక్తం చేయరు.  

ఈ దాచుకునే తత్వం  వల్లే మగవారిలో  మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు ఎక్కువగా  కనిపిస్తుంటాయి.  అందుకే.. ప్రతి కుటుంబం బాధ్యత పురుషుడిదే అయినా పురుషుడిని ఒత్తిడికి గురి చేయకుండా కుటుంబ బాధ్యతలను పంచుకోవాలి. అప్పుడే పురుషులకు మానసిక భారం తగ్గుతుంది.

కుటుంబంలో పురుషుడి పాత్ర

చాలా వరకు కుటుంబం అనేది తల్లి చేతుల్లో రూపుదిద్దుకుంటుందని అనుకుంటారు. కానీ తండ్రి నిశ్శబ్దంగా ప్రేమ చూపిస్తారు,  రక్షణ  ఇస్తారు,  సహకారం  అందిస్తారు. మగవారి కష్టాలు బయటకు కనిపించవు. కానీ వారి  వల్లే చాలా కుటుంబాలు ముందుకు సాగుతుంటాయి.  అందుకే మగవారు ఎప్పుడూ బాధ్యతలనే ప్రపంచంలోనే బ్రతికేస్తుంటారు. కుటుంబం కోసం కష్టిస్తూ.. కుటుంబానికి ప్రేను, రక్షణను అందిస్తూ తన బాధ్యతను నిర్వర్తించే ప్రతి పురుషుడు గొప్పవాడే..

                          *రూపశ్రీ.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu