పతకాలకు మీరూ పథకం వేయాలి!!


న్యూస్ ఛానెల్స్ లోనూ, న్యూస్ పేపర్స్ లోనూ ఇంకా సామాజిక మధ్యమాలలోనూ రాష్ట్రానికో, దేశానికో పతకం సాధించిన క్రీడాకారులను చూస్తే శభాష్!! దేశ పరువు నిలబెట్టారు అనే మాట చాలామంది నోటి నుండి వస్తుంది. అంతేనా!! ఇంట్లో ఉన్న తమ పిల్లల్ని చూసి మీరూ ఉన్నారు ఎప్పుడూ దుమ్ములో, బురదలో పందుల్లా దొర్లుతూ ఉంటారు అని విమర్శిస్తారు.


నాన్నా నేనూ నా స్కూల్ డేస్ లో ఫలానా క్రీడలో ఫస్ట్ వచ్చాను అంటే, అవునురా నిన్ను అడుక్కుతినమని ఒక బొచ్చె ఇచ్చారులే వాళ్ళు లాంటి ఎగతాళి మాటలు కూడా పుష్కలంగా  వస్తాయి పెద్దల నోటి నుండి. కానీ అలాంటి పెద్దలు తెలుసుకోవలసిన నిజం ఏమిటంటే ఇప్పుడు పథకాలు సాధించినట్టు టీవీ లలో, పేపర్లలో మెరిసే పిల్లల్ని ఆయా పిల్లల తల్లిదండ్రులు ఎంతో ప్రత్సహించారు. వెంట ఉంది పిల్లల్ని కోచింగులకు తీసుకెళ్లి, దగ్గరుండి వాళ్ళతో ప్రాక్టీస్ చేయిస్తూ వాళ్ళను ముందుకు నడిపించారు. కాబట్టే వాళ్లకు దేశ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అంతేనా పిల్లలకు ఆటల పట్ల ఉన్న ఆసక్తిని గమనించి వాళ్ళను వెనక్కు లాగి నిరాశపరచకుండా ప్రోత్సహించడం పిల్లల విషయంలో పెద్దలు తీసుకున్న గొప్ప నిర్ణయంగా ఒప్పుకోవాలి.


ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహిస్తే వచ్చే లాభాలు తెలిస్తే ఆటలా వైపు పిల్లల్ని తరుముతారేమో!!


గుర్తింపు, శారీరక వ్యాయామం!!


చిన్నతనంలో పిల్లలు సరిగ్గా ఎదగాలి అంటే ఆటలకు మించిన గొప్ప మార్గం లేదు. టీవీ యాడ్స్ లో అందరూ చూపించే కాంప్లాన్లు, హార్లిక్స్ ల కంటే క్రీడలు మంచి శరీర సామర్త్యాన్ని,  శారీరక ఎదుగుదలను కూడా పెంపొందిస్తాయి. అంతేకాకుండా క్రీడల్లో ఓటమి, గెలుపులు సహజం కాబట్టి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వైఫల్యాలు ఎదురైనప్పుడు స్పోర్టివ్ గా తీసుకోగలుగుతారు పిల్లలు. కాబట్టి క్రీడల ద్వారా మానసిక పరిణితి కూడా పెరుగుతుంది.


లక్ష్యాలు, లక్ష్యసాధనలు!!


లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం, వాటిని సాధించడం తెలిస్తే పిల్లల జీవితం ఎంతో క్రమశిక్షణ బాటలో ప్రయాణిస్తుంది. క్రీడల్లో ఇలాంటి లక్ష్యాలు, లక్ష్యసాధనలు పిల్లల చదువులో కూడా ఉపయోగపడతాయి. ఎప్పుడూ పుస్తకాల మధ్యన నలిగిపోయే పిల్లలకు క్రీడలు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి.


ఉద్యోగావకాశాలు!!


రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీలలో క్రీడల్లో రాణించే వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. క్రీడాకారుల కోటాలో ఇచ్చే ఇంటి స్థలాలు, ఇల్లు, ఉద్యోగాలు, ఇంకా ప్రోత్సాహక బహుమతిగా లక్షల రూపాయలు కూడా ఇస్తాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు జాతీయస్థాయిలో మెరిసినప్పుడు రాష్ట్రప్రభుత్వాల తరపున ప్రకటించే డబ్బు లక్షల్లో ఉంటుంది. 


మినహాయింపు!!


రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో రాణించే వారికి చదువుతున్న కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి కూడా మంచి సహకారం ఉంటుంది. నిజానికి ఇలా క్రీడల్లో స్థాయిల వారిగా వెళ్లడం కూడా కళాశాలలు, విశ్వవిద్యాలయాల తరపున జరగడం వల్ల ఒకానొక లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందుతాయి. 


ప్రత్యేక గుర్తింపు!!


క్రీడల్లో రాణించడం అంటే మంచి శరీర సామర్థ్యము కలిగి ఉండటం కాబట్టి ఆర్మీ, నేవీ వంటి విభాగాల్లో ఎంతో అరుదైన హోదాలు కూడా దక్కుతుంటాయి. ఇవి మాత్రమే కాకుండా ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి పురస్కారాలు కూడా వరిస్తాయి.


అందుకే మరి పిల్లలు ఆడుకుంటే పనికిమాలిన చర్యగా భావించి వారిని కట్టడి చేయకుండా హాయిగా ఆటల్లో రాణించేలా ప్రోత్సహించండి. రాజుల్లా, రాణుల్లా మంచి జీవితాన్ని పొందగలరు.


                              ◆వెంకటేష్ పువ్వాడ