విడిపోవడమే ఒకందుకు మంచిదైందా?
posted on Oct 16, 2015 3:12PM

రాష్ట్రం విభజనప్పుడు ఒకపక్క తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలంటే.. మరోపక్క సీమాంధ్ర ప్రజలు ఇవ్వడానికి వీల్లేదు అని ఒకటే ఆందోళనలు. కానీ ఎట్టకేలకు రాష్ట్ర విభజన జరిగింది. అయితే అటు తెలంగాణ కానీ.. ఇటు సీమాంధ్ర కానీ ఇద్దరి ఆందోళనలు చేయడానికి ముఖ్య కారణం మాత్రం రాజధానిగా ఉన్న హైదరాబాద్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మారినా అందరూ హైదరాబాద్ ను అభివృద్ధి చేశారే తప్ప ఇంక ఏ ప్రాంతం పైనా అంత దృష్టి సారించలేదు. అయితే ఇప్పుడు మాత్రం రాష్ట్ర విభజన జరగడమే మంచిదని అనుకుంటున్నారు చాలామంది. ఎందకంటే రాష్ట్ర విభజన జరిగిన తరువాతే అటు ఏపీలో తిరుపతి, విజయవాడ, రాజమండ్రి వంటి నగరాలు అభివృద్ది చెందుతున్నాయి. అంతేకాదు తెలుగు వారందరికీ గుర్తుండిపోయేలా ఏపీకి రాజధానిని కూడా నిర్మించాలని ఏపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇది ఒక రకంగా ఏపీ ప్రజలకు మంచిదే. అంతేకాదు అటు తెలంగాణలో అంతే.. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇతర ప్రాంతాలను అభివృద్ది చేయడానికి ప్రయత్నిస్తుంది. రెండు రాష్ట్రాలు అభివృద్దిలో పోటీపడి మరీ.. ఇతర దేశాల నుండి పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు కృషిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరకంగా కలిసి ఉండటం కంటే విడిపోయినప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగి ప్రగతిని సాధిస్తున్నాయి.