పోలీసుల నెత్తి మీదా ‘జగనన్న టోపీ’!
posted on Feb 2, 2022 12:25PM
‘అన్నం పెట్టిన చెయ్యినే కరిచాడు’ అనే సామెత జగన్ రెడ్డి సర్కార్ కు సరిగ్గా సరిపోతుందేమో! ప్రశ్నించిన ప్రత్యర్థి పార్టీల నాయకులు, శ్రేణులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరినైనా సరే పోలీసుతో దారుణంగా అణచివేస్తోంది ఏపీ సర్కార్.. ప్రశ్నించిన వారిని అణచివేసేందుకు పావుగా వాడుకుంటున్న పోలీసుల నెత్తిన కూడా ఫిట్ మెంట్ పేరుతో ‘జగనన్న టోపీ’ పెట్టింది సర్కార్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆందోళనలో కీలక అంశమైన హెచ్ఆర్ఏ తగ్గింపు విషయంలో పోలీసులకు కూడా శఠగోపం పెట్టింది. వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పోలీసులకు కూడా హెచ్ఆర్ఏ, డీఏ, సిటీ అలవెన్సుల్లో కోత కోసేసింది.
పోలీసులకు హెచ్ఆర్ఏ తగ్గింపు వర్తించదని కొద్ది రోజులుగా ప్రచారం చేసిన వైసీపీ సర్కార్ వాస్తవానికి వారికి కూడా పెద్ద కోత పెట్టింది. పైకి 23.29 శాతం ఫిట్ మెంట్ లెక్కలు వేసి మొత్తం కలిపితే.. పోలీసుల జీతం ఏమాత్రం తగ్గలేదని కలరింగ్ ఇచ్చింది. అయితే.. తాజాగా వచ్చిన పే స్లిప్పులు చూస్తే పోలీసులకు దిమ్మ దిరిగి బొమ్మ కనిపించింది. పే స్లిప్పులు చూసిన పోలీసులకు షాక్ తగిలినట్లయింది. పే స్లిప్పుల ప్రకారం పోలీసుల హెచ్ఆర్ఏలో తేడా వేలల్లో కనిపించింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో తోక తొక్కిన త్రాచులా వారు యూనియన్ నేతలు, ప్రభుత్వ పెద్దలపైనా పోలీసు భాషలో తూర్పార పడుతున్నారు.
పైగా సీఎం జగన్ రెడ్డి పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తున్నట్లు పైకి చెబుతుంటారని, వాస్తవంగా తమకు వీక్లీ ఆఫ్ లు అమలు కావడం లేదని వారు గుర్రుగా ఉన్నారు. సిబ్బంది కొరత పేరుతో పోలీసు బాసులు తమను వీక్లీ ఆఫ్ తీసుకోనివ్వడం లేదని, దాంతో తమకు పనిభారం కూడా ఎక్కువ ఉంటోందని ఆవేదనగా ఉంటున్నారు. పోలీసులకు సెలవుల సరెండర్ ఇవ్వడం లేదట. పని భారం ఉన్నా, వీక్లీ ఆఫ్ లు ఇవ్వకపోయినా.. సర్కార్ కు తాము ఎంతగా తోడ్పాటు అందిస్తున్నామని వారు వాపోతున్నారు. చివరికి తమకు హెచ్ఆర్ఏ కూడా తగ్గించేసి జగన్ రెడ్డి సర్కార్ ద్రోహం చేసిందని పూర్తిస్థాయిలో ఫైరవుతున్నారు. రాత్రనకా పగలనకా ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నామని, కోవిడ్ సమయంలో సైతం తాము కుటుంబాలను వదిలి రోడ్లపై విధులు నిర్వర్తించిన తమను జగన్ సర్కార్ ఇంత మోసం చేస్తుందా? అని ఆగ్రహంతో ఉన్నారు.
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి మహా నగరాల్లో సిటీ అలవెన్సులు కూడా రద్దు చేసి, హెచ్ఆర్ఏను 20 నుంచి 8 శాతానికి తగ్గించడాన్ని పోలీసులు తూర్పారపడుతున్నారు. చివరికి డీఏను కూడా 2 నుంచి 3 శాతం తగ్గించడం పట్ల పోలీసులు భగ్గుమంటున్నారు. ఒక పక్కన తమకు ఉన్న సౌకర్యాలు, రావాల్సిన అలవెన్సులు తగ్గించేస్తూ.. మరో పక్కన పోలీసులకు హెచ్ఆర్ఏ తగ్గబోదంటూ అసత్య ప్రచారం చేయడం ఏంటని వారు నిలదీస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జీఓలు మాదిరిగా తాము ఆందోళన చేయలేమని పోలీసులు ఆవేదనతో చెబుతున్నారు. అయితే.. వారు చేస్తున్న ఉద్యమంలో న్యాయం ఉందని పోలీసులు చెబుతుండడం విశేషం. తమను అన్ని విధాలా వాడుకుని, అడ్డంగా మోసం చేసిన జగన్ రెడ్డి సర్కార్ కు ఇకపై పోలీసులు వర్క్ టూ రూల్ పాటిస్తారేమో!