ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు.. జగన్ కు రఘురామ ప్రతిపాదన

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏపీ ఎంపీలంతా రాజీనామాలు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు అన్నారు. ఇందుకోసం తాను రాజీనామాకు సిద్ధమని పేర్కొన్న ఆయన వైసీపీ ఎంపీలందరి చేతా జగన్ రాజీనామాలు చేయిస్తే.. తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను బతిమాలి తాను రాజీనామాకు ఒప్పిస్తానని రఘురామ అన్నారు.

రచ్చబండలో మాట్లాడిన ఆయన 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యమని చెప్పిన జగన్ అధికారం చేపట్టిన తరువాత ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. ప్రత్యేక హోదా హామీని విస్మరిస్తే ప్రజల ఆసహ్యించకుంటారన్నారు. ఎప్పుడో జరిగిన శ్రీ భాగ ఒప్పందం గురించి మాట్లాడుతూ.. మూడేళ్ల కిందట ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని విస్మరించడమంత బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదని రఘురామకృష్ణం రాజు అన్నారు.  జగన్ ఏది చెబుతారో అది చేయరనడానికి తాజా ఉదాహరణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన అని అన్నారు. ఎన్నికలకు ముందు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరిస్తానని వాగ్దానం చేసిన జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తరువాత వారిని తొలగించడం దారుణమన్నారు.  

కర్నూలు వేదికగా సోమవారం (డిసెంబర్ 5) జరిగిన రాయలసీమ గర్జన సభ జంధ్యాల సినిమాను మించిన హాస్యరసం ఒలికించిందని రఘురామ అన్నారు.  కర్నూలు గర్జన సభకు జనసమీకరణ కోసం వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి బెదరించినా ఎవరూ రాలేదన్నారు.  కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టులో మాత్రం హైకోర్టు ఏర్పాటుపై మాట మార్చిందని గుర్తు చేశారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం లేదని నివేదించారని పేర్కొన్నారు. ఒకవైపు సుప్రీంకోర్టులో హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయబోమని చెబుతూనే, మరొకవైపు రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.