దేశంలోనే ఏపీ ఫస్ట్.. ఎందులోనో తెలుసా?

జగన్ పాలనలో అన్ని రంగాలలోనూ ఆంధ్రప్రదేశ్ అధమ స్థానంలోకి పడిపోయింది. అక్షర క్రమంలోనే తప్ప మరెందులోనూ ఏపీ ప్రథమ స్థానంలో లేదు సరికదా.. కింది నుంచి మొదటి స్థానం కోసం బీహార్ వంటి రాష్ట్రాలలో పోటీ పడుతోంది. అయితే ఒక్క విషయంలో మాత్రం ఏపీ దేశంలో మిగతా ఏ రాష్ట్రమూ కనీసం పోటీ కూడా పడలేనంత పురోభివృద్ధి సాధించింది. అయితే ప్రభుత్వం మాత్రం ఎందుకో ఈ అభివృద్ధిని ప్రచారం చేసుకోవడం లేదు సరికదా.. కనీసం తలచుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు.

అయితే దాచేద్దామంటే ఏదీ దాగదు కదా.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఏపీ సాధించిన పురోభివృద్ధిని బట్టబయలు చేసింది. ఇంతకీ జగన్ పాలనలో మూడున్నరేళ్లలోనే ఆంధ్రప్రదేశ్ ఎందులో కనీవినీ అభివృద్ధి సాధించిందని ఆలోచిస్తున్నారా? అంత శ్రమ వద్దు.. కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని తాజాగా విడుదల చేసిన స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదికలో చెప్పారు. స్మగ్లింగ్ ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. సాధారణంగా డ్రగ్స్ అనగానే ఎవరికైనా గోవా గుర్తుకు వస్తుంది. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినేష్. ఇక్కడికి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. అందుకని సహజంగానే డ్రగ్స్ విషయంలో గోవా ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. అక్కడా డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది.

కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ మూడేళ్లలో స్మగ్లింగ్ విషయంలో గోవాను మించిపోయింది. స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం 2021-22 దేశం మొత్తంలోనే అత్యధికంగా 18, 267 కిలోల డ్రగ్స్ స్వీధీనం అయ్యాయి. ఇది దొరికిన డ్రగ్స్ మాత్రమే. దొరకకుండా రాష్ట్రం ఎల్లలు దాటిపోయినా, లేదా రాష్ట్రంలోని యువత వినియోగించేసిన మాదక ద్రవ్యాల సంగతేమిటనే ప్రశ్నకు ఎవరూ బదులు చెప్పలేరు. మొత్తం మీద కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం డ్రగ్స్ సంబంధిత కేసుల్లో ఏపీలో 90 మందిని అరెస్టు చేశారు. తొలి స్థానంలో ఉన్న ఏపీలో ఏకంగా 18 వేల 267 కిలోల డ్రగ్స్ స్వాధీనమైతే, పొరుగున ఉన్న తెలంగాణలో  2021-22లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ కేవలం 830 కిలోలు మాత్రమే. దీనిని బట్టే డ్రగ్స్ వ్యవహారంలో ఏపీ సాధించిన పురోగతి ఎంత ఘనంగా ఉందో ఇట్టే చెప్పేయవచ్చు. అక్కడితో ఆగిపోలేదే.. ఆ నివేదిక ప్రకారం దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా అందుకు సంబంధించిన లింకులు ఏపీలో ఉంటున్నాయి.

ఇక గంజాయి విషయానికి వస్తే ఏపీలోని విశాఖ మన్యం ప్రాంతం నుంచి హస్తిన వరకూ గంజాయి స్మగ్లింగ్ సాగుతోంది. పలు సందర్భాలలో పెద్ద  ఎత్తున పట్టుబడి గంజాయి స్మగ్లింగ్ వాహనాలన్నీ ఇదే విషయాన్ని అప్పట్లోనే తేటతెల్లం చేశాయి. దాదాపు అన్ని రాష్ట్రాల పోలీసులూ కూడా తమ రాష్ట్రానికి గంజాయి ఏపీ నుంచే వస్తోందని నిర్ధారించేశారు.  మరి ఇంకా జగన్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనే అధోగతికి చేర్చాశారనే అందామా.. లేక అన్ని విధాలుగానూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన జగన్ పాలన ఒక్క డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో మాత్రం దేశంలోని మరే ఇతర రాష్ట్రం అందుకోలేనంత ఎత్తున నిలబెట్టాడని చెప్పుకుందామా?