జగన్ తో ఎక్కడ చెడింది.. మోహన్ బాబు కల ఎలా చెదిరింది?

నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. ఒకప్పుడు తెలుగుదేశంలో ఒక వెలుగు వెలిగారు. ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం కూడా పొందారు. ఆ తరువాత కారణాలేమైతేనేం.. తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. కొంత కాలం రాజకీయాలకు దూరంగా  ఉన్నా.. ఆ తరువాత వైసీపీ గూటికి చేరారు. చేరడం చేరడంతోనే ఆ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే అరహరం పాటుపడ్డారు. గత ఎన్నికలకు ముందు తన విద్యానికేతన్ విద్యార్థులతో కలిసి తిరుపతిలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదంటూ తన కుమారుతలో కలిసి రోడ్డెక్కారు.

ఏమైతేనేం.. గత ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైసీపీలో చాలా చాలా చురుకుగా.. ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీస్ పృధ్వీ, కమేడియన్ అలీ, నటుడు పోసానిలతో సమానంగా కష్టపడ్డారు. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యారు. అప్పటి నుంచీ మోహన్ బాబు తనకు ఏదో ఒక పదవి వస్తుందన్న ఆశతోనే గడిపారు. కానీ మొట్టమొదట థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీకి జగన్ పదవి కట్టబెట్టారు. శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ పదవిని కట్టబెట్టారు కానీ అది పృధ్వికి మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. ఒక మహిళకు ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావటంతో ఎస్వీబీసీ ఛైర్మన్‌ బాధ్యతల నుండి తప్పించారు.

ఆ తరువాత పృధ్వీ ముఖం చూసినా వారే వైసీపీలో లేకుండా పోయారు. ఇక తరువాత అలీ, పోసానిల వంతు వచ్చింది. ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన వారికి మూడేళ్ల తరువాత ఇక తప్పదన్నట్లుగా రెండు సలహాదారు పోస్టులు కట్టబెట్టి జగన్ చేతులు దులుపుకున్నారు. వారితో పాటే గాయని మంగ్లీకీ ఎస్వీబీసీలో ఓ పోస్టు పందేరం చేశారు. కానీ వారందరి కంటే ఎవరు ఔనన్నా కాదన్నా ఓ స్థాయి పైనున్న మోహన్ బాబును మాత్రం  జగన్ పట్టించుకోలేదు.  గత ఎన్నికల సమయంలో సీఎం వైయస్ జగన్‌కు బాసటగా ఉండి..  ప్రచారం చేసిన మోహన్ బాబుకు మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో సీఎం వైయస్ జగన్‌ వ్యవహారశైలిపై మంచు ఫ్యామిలీలో అసంతృప్తి పీక్స్ చేరిందని, దాని పర్యవసానమే సామాజిక మాధ్యమంలో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి సెటైరికల్ పంచ్ అని అంటున్నారు.  

అటు పరిశ్రమలోనూ, ఇటు పార్టీలోనూ కూడా మోహన్ బాబు ఎవరికీ పట్టని వ్యక్తిగా మిగిలిపోవడం ఆయన స్వయంకృతాపరాధమే అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మోహన్ బాబు తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అప్పట్లో ఇది రాజకీయంగా ఒకింత సంచలనం రేకెత్తించినా..  చిత్తూరు జిల్లాలోని తన కాలేజీలో షిర్డి సాయి విగ్రహ ప్రతిష్టకు చంద్రబాబును ఆహ్వానించడానికే ఆయన ఇంటికి వెళ్లినట్లు మోహన్ బాబు చెప్పి రాజకీయ ఊహాగాన సభలకు తెరదించడానికి ప్రయత్నించారు. మంచు విష్ణుకు సీఎం వైయస్ జగన్ సమీప బంధువుని... ఈ నేపథ్యంలో ఆయన అధికారంలోకి వస్తే.. టీటీడీ చైర్మన్ లాంటి పదవి కోసం మోహన్ బాబు ఆశించారనీ, కానీ చైర్మన్ పదవి కాదు కదా.. కనీసం సలహాదారు పదవి కూడా దక్కలేదన్న దుగ్ధ మోహన్ బాబులో పేరుకుపోయిందని ఆయన సన్నిహితులు అంటున్నారు.