దయచేసి మాకు ఓటేయకండి! సర్పంచ్ అభ్యర్థుల వింత ప్రచారం 

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఆదివారం చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు జరిగాయి. సొంత కుటుంబ సభ్యులే పోటీ పడ్డారు. అన్నాదమ్ముళ్లు, తోడి కోడళ్లు, అత్తా కోడళ్లు, తండ్రి కొడుకులు పంచాయతీ పదవుల కోసం పోరాడారు. నాలుగో దశకు సంబంధించి ఓ గ్రామంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. తమకు ఓటేయని ప్రచారం చేయాల్సిన అభ్యర్థులే.. ఇంటింటికి తిరిగి తమకు ఓటు వేయవద్దని ఓటర్లను కోరుతున్న పరిస్థితి నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం మొగలికుదురులో జరుగుతున్న ఈ ప్రచారం అందరిలోనూ చర్చగా మారింది. 

 మొగలికుదురు సర్పంచ్ పదవి కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. నామినేషన్ల గడువు కూడా ముగిసింది. కానీ అంతలోనే గ్రామస్తులంతా సమావేశమై ఒక్కరే పోటీలో ఉండాలి తీర్మానించారు. కడి అరుణ కుమారి పేరును ఖరారు చేశారు. అందరూ ఆమెకే ఓటు వేయాలని గ్రామస్తులకు చెప్పారు. ఈ నేపథ్యంలో బరిలో నిలిచిన మిగతా ఇద్దరు నాగలక్ష్మి, వెంటకరమణలు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ అప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో వారు కూడా పోటీలో ఉన్నట్లే లెక్క. ఎన్నికల అధికారులు గుర్తులను కూడా ఖరారు చేశారు. ఇక చేసేదేం లేక, ఆ ఇద్దరు అభ్యర్థులు గ్రామంలో విచిత్ర ప్రచారం చేస్తున్నారు. తాము పోటీలో లేమని.. మాకు ఓటు వేయకూడదని ప్రచారం చేస్తున్నారు. తమ గుర్తులను చూపించి వీటికి ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అరుణ కుమారినే గెలిపించాలని కోరుతున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu