ఏపీకీ పెట్టుబడుల ప్రవాహం.. మూడు సెల్ కంపెనీలు
posted on Sep 16, 2015 11:51AM

ఏపీకి అరుదైన ఘనత దక్కడంతో పెట్టుబడులు పెట్టడానికి చాలా కంపెనీలు ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలోనే పెట్టుబడులు పెట్టడానికి అనుకూల వాతావరణం ఉన్న ప్రదేశాల్లో రెండో స్థానం దక్కించుకోవడం రాష్ట్రానికే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా చాలా ఆనందాన్నిచ్చే అంశం. ఒకపక్క చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి.. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో చంద్రబాబు సర్కారుకు తీపి కబురును అందించింది. దీనిలో భాగంగానే చంద్రబాబు విజయవాడలోని ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే మూడు ముబైల్ కంపెనీలు తమ పెట్టుబడులను ఏపీ పెట్టడానికి గాను ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఏర్పాటు చేసిన వేదిక మీదే మైక్రోమ్యాక్స్.. సెల్ కాన్.. కార్బన్ కంపెనీలు తమ పెట్టుబడులను పెట్టడానికి ముందుకొచ్చారు. చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని రేణిగుంటలో తమ ఫ్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకు రావడం.. కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు ఎంవోయూలు కుదుర్చుకోవటం వెంటవెంటనే జరిగిపోవడం విశేషం. ఇప్పటికే ఏపీలో ప్రముఖ మొబైల్ కంపెనీ జియోమీ తన ఉత్పత్తిని ఏపీలో స్టార్ట్ చేసింది. దీంతో మొత్తం నాలుగు మొబైల్ కంపెనీలు ఏపీకి వచ్చాయి. మొత్తానికి ప్రపంచ బ్యాంకు నివేదిక పుణ్యమా అని ఏపీలోకి పెట్టుబడులు రావడం ఆనందాన్నిచ్చే అంశమే.