ప్రత్యేక హోదాపై జగన్ హ్యాండ్సప్! తాకట్టు పెట్టేసినట్టేనా..? 

ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు సంజీవని. స్పెషల్ స్టేటస్ ఏపీ హక్కు అని, విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదాతోనే న్యాయం జరుగుతుందనేది ప్రజల భావన. విభజన చట్టంలోనూ దీన్ని పొందు పరిచారు. పార్లమెంట్ లో అప్పటి దేశ ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. కాని విభజన జరిగి ఏడేండ్లు పూర్తైనా ప్రత్యేక హోదా హామీ మాత్రం నెరవేరలేదు. ఏపీతో కేంద్ర ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయనే ఆగ్రహం ఏపీ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. ప్రత్యేక హోదా కేంద్రంగానే రాజకీయం చేశారు. తమ పార్టీకి అధికారం ఇస్తే కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. కాని ఆయన అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తైనా ప్రత్యేక హోదాపై మాత్రం అతిగతీ లేదు. 

ప్రత్యేక హోదా సాధించడం కాదు..  కనీసం ఆ పదం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పలకడం లేదనే విమర్శలు ఉన్నాయి. కేంద్రాన్ని నిలదీస్తానన్న జగన్... కేంద్రం ముందు హోదా ప్రస్తావన కూడా తేవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మడమ తిప్పేది లేదు.. మాట తప్పేది లేదు అని గొప్పగా చెప్పుకునే జగన్.. ప్రత్యేక హోదా విషయంలో మాత్రం మడమ తిప్పేశారని, కేంద్రానికి తాకట్టు పెట్టేశారనే విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల కోసం ప్రత్యేక హోదా గురించి కేంద్రంతో రాజీ పడ్డారని మండిపడుతున్నాయి. వైసీపీ నేతలు మాత్రం ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నామని చెబుతున్నారు. అయితే తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డే ప్రత్యేక  హోదాపై చేతులెత్తేశారు. కేంద్రం దగ్గర చేసేదిమి లేదంటూ.. ప్రత్యేక హోదా ఇక రాదనే సంకేతమిచ్చారు. 

2021-22కు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామని చెప్పారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో సంకీర్ణ సర్కార్ లేదని, కేంద్రం దగ్గర చేసేదేమి లేదని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేమంటూ.. తన వల్ల కాదని అంగీకరించారు జగన్. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడుతానని చెప్పిన జగన్... ఇప్పుడు ఏం చేయలేమంటూ హ్యాండ్సప్ అనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

లోక్ సభలో వైసీపీకి 22 మంది ఎంపీలున్నారు. లోక్ సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉంది వైసీపీ. 22 మంది ఎంపీలున్నా కేంద్రంతో పోరాడలేమని సీఎం జగన్ చెప్పడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అసలు కేంద్రాన్ని అడగకుండా ఎలా సాధిస్తారని ప్రశ్నిస్తున్నారు. 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరగదా అని కొందరు నిలదీస్తున్నారు. జగన్ వాలకం చూస్తుంటే ప్రత్యేక హోదా తమకు అక్కరలేదని కేంద్రానికి చెప్పినట్లుగా ఉందనే అభిప్రాయం కూడా కొన్ని  వర్గాల నుంచి వస్తోంది.  విపక్షాలు ఆరోపిస్తున్నట్లు తన కేసుల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టినట్లుగా ఉందని ఏపీ జనాలు అనుమానిస్తున్నారు. సంకీర్ణ సర్కార్ కాకున్నా కొన్ని రాష్ట్రాలు తమకు కావాల్సిన వాటిని సాధించుకుంటున్నాయని చెబుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను చూసైనా జగన్ నేర్చుకోవాలని సూచిస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు, కేసుల కోసం రాజీ పడి.. రాష్ట్రానికి జగన్ అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు.