ఏపీలో కర్ఫ్యూ మరింత సడలింపు.. ఆ జిల్లాలో పాత రూల్సే..

ఆంధ్రప్రదేశ్ లో  కర్ఫ్యూ వేళలను మరింత సడలించారు. పగలంతా కర్ఫ్యూ ఎత్తేశారు. కొవిడ్ పై సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు సడలింపు ఉండగా.. ఇకపై ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలింపు ఇవ్వాలని కర్ఫ్యూ సీఎం జగన్ నిర్ణయించారు. జూన్‌ 20 నుంచి 30 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సాయంత్రం 5 గంటల కల్లా దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ కచ్చితంగా అమలవుతుంది. 

తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం పాత రూల్సే అమలు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మాత్రమే సడలింపు వర్తించనుంది. కొవిడ్‌ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మాత్రమే సడలింపు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ రెగ్యులర్‌ టైమింగ్స్‌ ప్రకారం నడవనున్నాయి. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేస్తున్నారు.  ఏపీలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గతంలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవగా.. ప్రస్తుతం 6 వేలకు పైగా కేసులు వస్తున్నాయి.