చంద్రబాబు ఇంటికి తెలంగాణా ప్రభుత్వం రోడ్లు వేయదా?

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం ప్రస్తుతం నివాసముంటున్న జూబిలీహిల్స్ భవనానికి మరమత్తులు చేయించాలని భావించడంతో వారు శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మస్జిద్ బండ ప్రాంతంలో పాత బొంబాయి హైవే సమీపంలో గల తమ ఫారం హౌస్ లోకి మారుదామనుకొన్నారు. కానీ ఆ ప్రాంతానికి రోడ్లు, వీధి దీపాలు, మురికి కాలువలు వంటి సౌకర్యాలు ఏవీలేకపోవడంతో, స్థానిక తెదేపా కార్పొరేటర్ యస్.శ్రీనివాస్ రెడ్డి వాటిని ఏర్పాటు చేయవలసిందిగా జి.హెచ్.యం.సి.కి జూలై నెలలో ఒక వినతి పత్రం ఇచ్చారు. అక్కడ ఆ సౌకర్యాలు కల్పిస్తే ఆ ప్రాంతంలో గల రాజరాజేశ్వరి కాలనీ మరియు రాఘవేంద్ర కాలనీలలో నివసించే ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని తెదేపా కార్పొరేటర్ తెలిపారు.జి.వి.జి. హిల్స్ నుండి చంద్రబాబు నివాసం వరకు గల మూడు కిమీ ప్రాంతంలో ఆ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసేందుకు రూ. 1.98కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. జి.హెచ్.యం.సి. స్టాండింగ్ కమిటీ కూడా దానికి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత దృష్ట్యా ఆ ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉందని ఇరు రాష్ట్రాల ఇంటలిజన్స్ ప్రధాన అధికారులు కూడా అంగీకరించారు. అయితే నేటికీ జి.హెచ్.యం.సి. అక్కడ ఎటువంటి పనులు మొదలుపెట్టలేదు. కారణం తెలంగాణా ప్రభుత్వం అందుకు సమ్మతించకపోవడమే. కారణాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అందరికీ తెలిసినవే. అయితే అటువంటిదేమీలేదని, అసలు తనకు అటువంటి ప్రతిపాదనలు ఏవీ రాలేదని జి.హెచ్.యం.సి.కమీషనర్ సోమశేఖర్ చెప్పడం విశేషం. ఇక చేసేదేమీ లేక చంద్రబాబు నాయుడే స్వయంగా ఆ ప్రాంతంలో రోడ్లు వీధి దీపాలు ఏర్పాటుకు పూనుకొంటున్నట్లు తెలుస్తోంది.