ఏపీ రాజధాని విశాఖ ఎప్పుడైంది! ఆంధ్రులతో కేంద్రం ఆటలేందీ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంటీ? ఈ ప్రశ్నకు ప్రతి ఆంధ్రుడి నుంచి వెంటనే వచ్చే సమాధానం అమరావతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఏపీకి రాజధానిగా 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని ఖరారు చేసింది. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి పునాదులు కూడా పడ్డాయి. అమరావతి నిర్మాణ  శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని 2015లోనే కేంద్రం కూడా నోటి ఫై చేయడం జరిగింది. రాజధానిలో నిర్మాణ పనులు కూడా  మొదలయ్యాయి. సచివాలయంతో పాటు అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు చకచకా పూర్తి కావడంతో అక్కడి నుంచే పాలన సాగుతోంది. ఆంధ్రులంతా అమరావతిని తమ కలల రాజధానిగా భావించారు. 

2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వచ్చిరాగానే అమరావతిపై పడింది. చంద్రబాబుకు పేరు వస్తుందన్న అసూయో మరోదే కాని కలల రాజధానిని ముక్కలు చేసే ప్రయత్నాలు చేసింది.  2019 నవంబర్ లో మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది జగన్ రెడ్డి సర్కార్.  పరిపాలనా (ఎగ్జిక్యూటివ్) రాజధానిగా విశాఖపట్నం.. న్యాయ (జ్యుడీషియల్) రాజధానిగా కర్నూలు.. శాసన (లెజిస్లేచర్) రాజధానిగా అమరావతి ఉంటుందని తెలిపింది.ఏపీ మూడు రాజధానులకు సంబంధించిన సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు ఆగస్టు, 2020లో గవర్నర్  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజముద్ర వేశారు. అయితే మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాడుతున్న అమరావతి  రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అమరావతి తరలింపునకు సంబంధించి రైతులతో పాటు ఇతరులు ఏపీ హైకోర్టులో దాదాపు వంద వరకు కేసులు వేశారు. వీటిపై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. హైకోర్టు విచారణ పూర్తయ్యే వరకు అమరావతి రాజధాని తరలింపు సాధ్యం కాదు. జగన్ కు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతే. ఈ విషయం తెలుసు కాబట్టే.. కోర్టు కేసుల్లే తేలవరకు ఏం చేయలేమని క్లారిటీ ఉంది కాబట్టే రాజధాని విషయంలో జగన్ సర్కార్ సైలెంట్ అయింది.

ఏపీ రాజధాని అంశం హైకోర్టులో ఉండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం అమరావతి విషయంలో ఆటలాడుతోంది. గడియకో మాట మాట్లాడుతూ జనాల్లో గందరగోళం స్పష్టిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఓ డాక్యుమెంట్ తీవ్ర వివాదస్పమవుతోంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటికి సంబంధించి లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నలు అడిగారు. పెట్రోల్, డీజిల్ పై కేంద్రం ఎంత ట్యాక్స్ వసూల్ చేస్తుందన్నది వాళ్ల ప్రశ్న. కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నకు  కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జూలై 26న లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అందులో దేశంలోని అన్ని రాష్ట్రాలు విధిస్తున్న పెట్రోల్, డీజిల్ పన్నులు.. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ధరలను పొందుపరిచారు. అయితే ఇందులో రాష్ట్రాల రాజధానుల దగ్గర ఏపీకి వచ్చేసరికి విశాఖ అని ఉంది. ఇదే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.

ఏపీ రాజధాని విశాఖ అని కేంద్రం లోక్ సభకు ఇచ్చిన డాక్యుమెంట్ లో ఉండటంతో ... ఏపీకి రాజధానిగా విశాఖను కేంద్రం అంగీకరించిందా అన్న చర్చ సాగుతోంది. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంతో వైసీపీలో సంతోషం వ్యక్తం అవుతుండగా.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. కేంద్ర సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమరావతి అంశం హైకోర్టు పరిధిలో ఉంది. అమరావతి కేసులపై విచారణ కొనసాగుతోంది. ఆగస్టు 23న కూడా విచారణ జరిగింది. తదుపరి విచారణకు నవంబర్ కు వాయిదా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు పరిధిలో ఉన్న అంశంలో కేంద్రం విశాఖను రాజధానిగా ఎలా పొందుపరిచిందని ప్రశ్నిస్తున్నాయి. అత్యంత ముఖ్యమైన విషయంలో కేంద్ర సర్కార్ ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహిరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి.

గతంలోనూ అమరావతి విషయంలో కేంద్రం ఇలాంటి తప్పే చేసింది. గత జూన్ లో చైతన్యకుమార్‌రెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ఏపీ మూడు రాజధానుల అంశంపై కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేశారు. దీనికి ఆ శాఖ సీపీఐఓ డైరెక్టర్‌ రేణు సరిన్ ఈ నెల 6న సమాధానం ఇస్తూ.. అమరావతి ప్రస్తావన తీసుకురాకుండా.. ‘ఏపీ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టం-2020’ కింద వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు పరిపాలన కేంద్రాలు ఉంటాయని, వీటిని రాజధానులు అంటారని వివరించారు. రాజధాని అంశాన్ని ఆ రాష్ట్రమే నిర్ణయించుకుంటుందని తెలిపారు. కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాధానంపై అమరావతి జేఏసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అమరావతి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్‌ జీవీఆర్ శాస్త్రి.. కేంద్ర హోంశాఖ అప్పిలేట్‌ అథారిటీ అయిన సంయుక్త కార్యదర్శి ప్రకాష్‌కు ఈనెల 9న లేఖ రాశారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు సమాచారం ఇచ్చారని అందులో పేర్కొన్నారు. రేణు సరిన్ పేర్కొన్న చట్టం ఇంకా అమల్లోకి రాలేదని గుర్తు చేశారు. రాజధాని అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. శాస్త్రీ లేఖపై స్పందించిన సరిన్.. గతంలో తానిచ్చిన సమాధానాన్ని సవరించారు. ఏపీ రాజధాని అంశం న్యాయపరిధిలో ఉందని స్పష్టం చేశారు.

అమరావతి విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి మళ్లీ సరిదిద్దుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ అలాంటి తప్పే చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో  ఏపీ రాజధాని అంశం న్యాయపరిధిలో ఉందని స్పష్టం చేసిన కేంద్రం... ఇప్పుడు ఎందుకు ఇలా చేసిందనే ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. నిజానికి కేంద్ర పెట్రోలియం శాఖ ఇచ్చిన వివరాల్లో విశాఖలోని పెట్రోల్, డీజిల్ రేట్లను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  అంతవరకు బాగానే ఉన్నా.. విశాఖను ఏపీ రాజధానిగా చూపడమే వివాదాస్పమవుతోంది. అమరావతి విషయంలో బీజేపీ మొదటి నుంచి డబుల్ గేమ్ ఆడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీ బీజేపీ నేతలు అమరావతికి మద్దతుగా మాట్లాడుతుండగా... కేంద్రం మాత్రం 'రాష్ట్ర రాజధాని ఎక్కడ.? అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెబుతూ వస్తోంది. తాజాగా ఏపీ రాజధానిగా విశాఖను చూపుతూ పెట్రోలియం శాఖ ఇచ్చిన డాక్యుమెంట్ తో కేంద్రం ఈ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్ధమవుతోంది. ఇప్పటికైనా జరిగిన తప్పును కేంద్రం సరిద్దిది జనాల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు.  
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu