పాత కాపులతో విజయమ్మ కొత్త వ్యూహమా? జగన్ కోసమా? షర్మిల కోసమా?
posted on Aug 29, 2021 4:27PM
జగన్ పక్కన పెట్టేశారు. విజయమ్మ ఫోన్ చేసి పిలుస్తున్నారు. జగన్ కాదనుకున్నారు. విజయమ్మ కావాలనుకుంటున్నారు. వారంతా వైఎస్సార్ హయాంలో హేమాహేమీలు. సెప్టెంబర్ 2న పావురాల గుట్టలో ఆయన మరణంతో చాలామంది కీలక నేతలు తెరమరుగు అయిపోయారు. కాంగ్రెస్‌లో ఉన్నా.. లేనట్టుగానే మిగిలిపోయారు. పార్టీకే కట్టుబడి ఉన్నారు. పదవులకు కక్కుర్తిపడి జగన్ పంచన చేరలేదు. అలాంటి వారందరినీ 12 ఏళ్ల తర్వాత విజయమ్మ గుర్తుకుపెట్టుకొని మరీ ఫోన్లు చేసి స్పెషల్‌గా ఇన్వైట్ చేయడాన్ని ఎలా చూడాలి? ఇన్నేళ్లూ లేనిది ఇప్పుడే విజయమ్మకు వారు ఎందుకు గుర్తుకు వస్తున్నట్టు? దీని వెనుక ఏదైనా మర్మం ఉందా? మరేదైనా రాజకీయ వ్యూహం దాగుందా? అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఏపీలో కేవీపీ, ఉండవల్లిలాంటి వాళ్లు ఒకప్పుడు వైఎస్‌కు లెఫ్ట్, రైట్ అన్నట్టు ఉండేవారు. కేవీపీ మైండ్‌ను వైఎస్సార్ విచ్చలవిడిగా వాడుకుంటే.. ఉండవల్లి నోరును రామోజీరావుపై ఆయుధంగా ప్రయోగించారు. ఇక తెలంగాణలో డీఎస్, కోమటిరెడ్డి, పొన్నం లాంటి వాళ్లు రాజశేఖర్‌రెడ్డికి నమ్మినబంట్లలా ఉండేవారు. వైఎస్సార్ మరణించాక వారంతా జగన్ వెంట పోలోమని పార్టీ ఫిరాయించలేదు. వైఎస్సార్ బలోపేతం చేసిన కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. వైఎస్సార్ ఆత్మలాంటి కేవీపీపై జగన్ చేసిన రాజకీయ కుట్రలు అన్నీఇన్నీ కావు. కాంగ్రెస్‌ను వీడిన తొలినాళ్లలోనే కొండా సురేఖతో కేవీపీ మీద అవినీతి విమర్శలు చేయించిన చరిత్ర జగన్‌ది. తండ్రికి అత్యంత ఆత్మీయుడైన కేవీపీని తొక్కేయాలని చూసిన ప్రబుద్ధుడు జగన్. ఉండవల్లిని సైతం డోంట్‌కేర్ అన్నారు. అందుకే, వారిద్దరు జగన్ ఇగోకు తట్టుకోలేక.. కాంగ్రెస్‌లోనే కొనసాగారు. ఇక జగన్ ఏపీకే పరిమితమయ్యారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ వాదుల గురించి పెద్దగా పట్టించుకోలేదని చెప్పొచ్చు. జగన్ విషయం పక్కనపెడితే.. సడెన్‌గా విజయమ్మకు వాళ్లంతా ఎందుకు గుర్తొచ్చారనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్.
మామూలుగా నైతే ఏడాదికో, పదేళ్లకో, 20, 25, 50, 75, 100 ఇలా కొన్ని మైలురాయి సంవత్సరాలను ప్రత్యేకంగా జరుపుతుంటారు. కానీ, వైఎస్సార్ చనిపోయి 12 ఏళ్లు అవుతోంది. ఇదేమంత ప్రత్యేక సమయమూ కాదు. కానీ, ఎందుకనో కానీ విజయమ్మ వైఎస్సార్ వర్థంతిని ఈసారి ప్రత్యేకంగా జరపాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు ప్రత్యేక ఆహ్వానితులుగా అప్పటి వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితులు, కేబినెట్ సహచరులను ఫోన్ చేసి మరీ ఆహ్వానిస్తున్నారని సమాచారం. కేవీపీ, ఉండవల్లి నుంచి డీఎస్ వరకు.. ఇరు రాష్ట్రాల్లో ఉన్న వైఎస్సార్ మనుషులను ఇన్వైట్ చేయడంపై రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
వారంతా వస్తారా? రారా? అనేది పక్కన పెడితే.. పిలిచారా.. లేదా.. అనేదే ఇక్కడ కీలకాంశం. ఇదంతా ఎందుకు? విజయమ్మ మునుపెన్నడూ లేనిది ఈసారి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నట్టు? జగన్ కోసమా? షర్మిల కోసమా? అంటే ఇద్దరి కోసమూ అనే వారూ ఉన్నారు. ప్రస్తుతం విజయమ్మ జగన్‌కు దూరంగా షర్మిల చెంత ఉంటున్నా.. ఎంతకాదన్నా వారంతా ఒకే కుటుంబం.. వారంతా ఒక్కటే.. పైపైకి అలా చేస్తున్నారనే అనుమానమూ ఉంది. ప్రస్తుతం ఏపీలో జగన్ పరిస్థితి అసలేమాత్రం బాగాలేదు. ప్రజావ్యతిరేకత, సీబీఐ కేసు, బెయిల్ రద్దు అయ్యే అవకాశం, జగన్ జైలుకెళితే పార్టీని హస్తగతం చేసుకోవాలని కాచుకు కూర్చున్న కీలక నేతల ద్వయం.. ఇలా జగన్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారనేది విజయమ్మ భావన. ఇప్పుడున్న వైఎస్సార్‌సీపీలో ఎవరినీ గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు. ఎవరూ అంతటి సమర్థులూ కారు. అందుకే, తన భర్త వైఎస్సార్ నమ్మిన కేవీపీ, ఉండవల్లి లాంటి వారినే ఇప్పుడు విజయమ్మ సైతం నమ్ముతున్నారు. వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి.. ఆనాటి నమ్మదగిన నేతలను ఆహ్వానించి.. వారితో కీలక మంతనాలు జరపాలనేది విజయమ్మ ఆలోచనలా కనిపిస్తోంది. జగన్‌ను సురక్షితం చేసేందుకు వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని భావిస్తున్నట్టు ఉంది. జగన్‌కు సంబంధం లేకుండా.. కొడుకు కోసం విజయమ్మ చేస్తున్న సొంత ప్రయత్నం అంటున్నారు. మరి, అందుకు ఆనాటి నేతలు ఈనాడు ఆమెకు ఏమేరకు సహకరిస్తారో చూడాలి..
ఇక, తెలంగాణలోని వైఎస్సార్ ప్రధాన సహచరులను ఆహ్వానించడం వెనుకున్న రీజన్‌ను ఈజీగానే గెస్ చేయొచ్చు అంటున్నారు. ఇంకెందుకు షర్మిల కోసమే. వైఎస్సార్ పేరు మీదుగా పార్టీ పెట్టినా.. పాపం షర్మిలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక్క కోమటిరెడ్డి బ్రదర్స్ ఆల్ ది బెస్ట్ చెప్పడం మినహా పాత కాపులెవరూ ఆమెకు కొత్తగా సపోర్ట్ చేయడం లేదు. అందుకే, వైఎస్సార్ వర్థంతి పేరుతో.. పాత వైఎస్ సెంటిమెంట్‌ను కొత్తగా రాజేసేందుకు విజయమ్మ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అందుకే, ఆనాటి వైఎస్సార్ కేబినేట్ సహచరులందరినీ సెప్టెంబర్ 2న ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారట విజయమ్మ. పాపం.. కూతురు కోసం విజయమ్మ ఇంతగా ప్రయత్నిస్తున్నా.. అది ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి...