నరసింహన్ ఇంటికి వెళ్ళక తప్పదా?

 

అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించి సీబీఐ జరుపుతున్న విచారణ ప్రక్రియలో భాగంగా సీబీఐ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ని కూడా ప్రశ్నించింది. అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు అంశంతో ప్రమేయం వున్న నారాయణన్, వాంగ్ ఛూలను సీబీఐ ఇప్పటికే ప్రశ్నించడం, మొన్నటి వరకూ గవర్నర్ పదవులను వెలగబెట్టిన వారిద్దరూ తమ పదవుల నుంచి తప్పుకోవడం తెలిసిందే. ఇప్పుడు సీబీఐ నరసింహన్‌ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో నరసింహన్ గవర్నర్‌ గిరీకి రాజీనామా చేయక తప్పదా అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే సీబీఐ నరసింహన్‌ని ప్రశ్నించింది. స్కామ్‌లో భాగస్వామి రూపంలో కాదు.. కేవలం ఒక సాక్షిగా మాత్రమే కావడంతో ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు మరోవైపు వినిపిస్తున్నాయి. యుపిఎ హయాంలో నియమితులైన గవర్నలను తొలగించే ప్రయత్నాల్లో భాగంగా పావులు కదుపుతున్న ఎన్డీయే ప్రభుత్వం నరసింహన్‌ని కూడా సాగనంపడానికే సీబీఐ ఆయనని ప్రశ్నించేలా చేసిందా అనే సందేహాలు వున్నప్పటికీ, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నరసింహన్‌ని పదవి నుంచి తప్పుకోవాలని కోరుతూ ఎలాంటి సూచనా చేయలేదు. యుపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లలో ‘పర్లేదు కొనసాగించవచ్చు’ అని భావిస్తున్న వారిలో నరసింహన్ పేరు కూడా వుందన్న అభిప్రాయాలు ఇంతవరకూ వ్యక్తమవుతూ వచ్చాయి. నరసింహన్‌ పదవికి ఇప్పట్లో ఇబ్బందేమీ లేదన్న సంకేతాలే ఇంతవరకూ అందుతూ వచ్చాయి. అయితే అకస్మాత్తుగా నరసింహన్‌ని కూడా కేంద్రం ముగ్గులోకి లాగడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి లోను చేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ల తొలగింపు కార్యక్రమాన్ని, అగస్టా స్కామ్‌ విచారణను ఒకే గాటన కట్టాలా, వద్దా, ఈ విచారణ గవర్నర్లను తొలగించడానికే చేస్తున్నారా అనే సందేహాలు కూడా జనాన్ని కన్ఫ్యూజన్‌కి గురి చేస్తున్నాయి. అయినా ఈ విషయం మీద అతి తక్కువ వ్యవధిలోనే క్లారిటీ వచ్చే అవకాశం వుంది. సీబీఐ ప్రశ్నించిన నరసింహన్ త్వరలో ఈ విషయం మీద ప్రతిస్పందించే అవకాశం వుంది. అప్పుడే నరసింహన్ భవితవ్యం ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu