కర్మాగారాలలో కూడా మహిళలు నైట్ డ్యూటీలు

 

ఇంతవరకు కాల్ సెంటర్స్ లో మాత్రమే మహిళలను నైట్ షిఫ్ట్ చేసేందుకు అనుమతిస్తున్నారు. కానీ అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడేందుకు సై అంటున్న మహిళలకు భద్రతా కారణాల దృష్ట్యా కర్మాగారాలలో మాత్రం రాత్రి డ్యూటీలు చేసేందుకు అనుమతించడం లేదు.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కర్మాగారాల చట్టంలో సెక్షన్ 66 (1) (సి) ప్రకారం రాత్రి 7గంటల నుండి ఉదయం 6గంటల వరకు మహిళలు కర్మాగారాలలో పనిచేయడాన్ని 2001 సం.లో హైకోర్టు నిషేధం విధించింది. కానీ అప్పటికి ఇప్పటికీ సామాజిక స్థితిగతులలో చాలా మార్పులు కలిగాయి కనుక ఆ నిర్ణయంపై పునరాలోచించుకోవలసిన అవసరం ఏర్పడింది.

 

ఇటీవల శ్రీసిటీలో వివిధ కర్మాగారాలకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశమయినప్పుడు మహిళలను రాత్రి డ్యూటీలు చేసేందుకు అనుమతించాలని వారు కోరారు. ఆటో మొబైల్, ఫుడ్ ప్రాసెస్సింగ్, బట్టల తయారీవంటి కొన్ని కర్మాగారాలలో మూడు షిఫ్టులలో నిరంతరంగా ఉత్పత్తి కార్యక్రమాలు జరుగుతుంటాయి. వాటిలో ఎక్కువగా మహిళలే పనిచేస్తుంటారు. కానీ వారు రాత్రి డ్యూటీలు చేసేందుకు అనుమతించకపోవడం వలన ఉత్పత్తి కార్యక్రమాలకి పెద్ద అవరోధంగా నిలుస్తోందని, కనుక కర్మాగారాలలో మహిళలు నైట్ డ్యూటీలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. అందుకు సమ్మతించిన ఆయన తక్షణమే అందుకు తగిన నియమ నిబంధనలను రూపొందించాల్సిందిగా రాష్ట్ర డైరక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ని ఆదేశించారు. మహిళలకు కర్మాగారాలలో తగిన భద్రత, విశ్రాంతి గదులు, టాయిలెట్లు, వారి పసిపిల్లలకు క్రేచ్చ్ ఏర్పాటు వంటి రక్షణ, రవాణా వంటి ఏర్పాట్లు కల్పించే కర్మాగారాలలో మహిళలు రాత్రి డ్యూటీలు కూడా చేసేందుకు వీలుగా తగిన నియమ నిబంధనలు రూపొందించమని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్రయత్నాలు ఫలిస్తే కర్మాగారాలలో కూడా మహిళలు రాత్రి డ్యూటీలు చేసుకోవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu