కలకలం రేపుతున్న..ఈ స్టాంపుల కుంభకోణం!

 

అనంతపురం జిల్లాలో నకిలీ స్టాంపుల కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. కళ్యాణదుర్గంలో మీసేవ కేంద్రం నిర్వహిస్తున్న బోయ ఎర్రప్ప, అలియాస్ మీసేవ బాబు ఈ నకిలీ స్టాంపుల కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఎస్సార్సీ ఇన్ఫ్రా వారు తమ అంతర్గత ఆడిటింగ్ లో నకిలీ ఈ స్టాంపులను గుర్తించి అనంతపురం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. పోలీసులు వెంటనే మీసేవ కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడ కొన్ని  తహసీల్దార్ల నకిలీ రబ్బర్ స్టాంపులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మీ సేవ బాబు, ఆయన సతీమణి భార్గవి, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్టు సమాచారం. తాజాగా కేసును కళ్యాణదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు వారి అరెస్టు చూపితే గానీ పూర్తి వివరాలు అధికారికంగా వెల్ల డయ్యే అవకాశం లేదు. అయితే, ఒక కిలోకు పైగా బంగారు నగలు, 1.2 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ను పోలీసులు గుర్తించినట్టు చెబుతున్నారు. 

 కుంభకోణం విలువెంత? 

నకిలీ ఈ స్టాంపుల ద్వారా మీ సేవ బాబు ఎంత మేరకు కుంభకోణం చేశాడనే అంశం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది...తాము ఒక్కరమే మీసేవ బాబు వద్ద 23 లక్షల రూపాయల విలువ చేసే 467 ఈ స్టాంపులను కొనుగోలు చేశామని ఎస్ఆర్సీ ఇన్ఫ్రా కంపెనీ వారు తెలియజేశారు. దీన్నిబట్టి ఎంత పెద్ద మొత్తంలో మీసేవ బాబు నకిలీ ఈ స్టాంపులను విక్రయించి ఉంటాడో ఊహించుకోవచ్చు. మొత్తం మీద 13వేల నకిలీ ఈ స్టాంపులను మీ సేవ బాబు విక్రయించినట్టు చెబుతు న్నారు. అయితే వాటి విలువ ఎంత అనేది పోలీసుల విచారణలోనే తెలియాల్సి ఉంది.
 
ఎవరీ మీసేవ బాబు? 

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి కి చెందిన బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు సామాన్య రైతు కుటుంబానికి చెందినవాడు. ఇంటర్ వరకు చదువుకున్న ఎర్రప్ప తొలుత కొన్ని దినపత్రికల్లో ఆఫీస్ బాయ్ గా పని చేస్తూ కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకున్నాడు. 2019 నుంచి మీసేవ కేంద్రం నడుపుతూ వచ్చాడు. 2020లో ఆధార్ సెంటర్ కు అనుమతి తెచ్చుకున్నాడు. అధికారులతో పరిచయాలు పెంచుకుని వారి సహకారంతో నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు తయారు చేసే వాడనే విమర్శలు వచ్చాయి. అయినా, అధికారులెవరూ దృష్టి సారించి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో అతను మరింత వేగం పెంచి నకిలీ ఈ స్టాంపుల కుంభకోణానికి సైతం తెర తీశాడు. 

 రాజకీయ పార్టీల పాత్ర ఏమిటి ?

కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కు చెందిన ఎస్సార్సీ ఇన్ఫ్రా కంపెనీ వారు చాలా కాలంగా మీ సేవ బాబు వద్దే ఈ స్టాంపులు కొనుగోలు చేస్తూవచ్చారు. ఈ క్రమంలోనే రూ 900 కోట్ల రుణం కోసం తాజాగా కూడా వారు ఈ స్టాంపులు కొనుగోలు చేశారు. అయితే, అందుకు సంబంధించి స్టాంపు డ్యూటీ చెల్లించిన వివరాలు బయటపెట్టాలని వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త రంగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఈ కుంభకోణంలో పాత్ర ఉంది కాబట్టే వారు ఆ వివరాలు బయటకు వెల్లడించడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. మీ సేవ బాబుతో సురేంద్రబాబుకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తున్నారు. అయితే, వైసీపీ నేతలతో సైతం మీసేవ బాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, దీంతో వారు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని 

ఎమ్మెల్యే  సురేంద్రబాబు ఆరోపిస్తున్నారు

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒక యూట్యూబర్ గా మీసేవ బాబు తనకు పరిచయమయ్యారన్నారు. తనతో ఫోటోలు దిగినంత మాత్రాన ఎవరెవరో చేసే అక్రమాలతో తనకు సంబంధం ఉందని చెప్పడం అర్ధరహితం అన్నారు. తమ పేరుపై ఉన్న బ్లాంక్ ఈ స్టాంపును మీడియాకు చూపించారని, కుట్రలో భాగస్వాములు కాకపోతే ఆ పేపరు వారికి ఎలా వచ్చిందో చెప్పాలని ఆయన నిలదీశారు. మొత్తం మీద నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం కూడా రాజకీయ రంగు పు లుముకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏసీబీ, సిట్, సిబిఐ వంటి ఏ విచారణ సంస్థతోనైనా విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే నిరూపించాలని సురేంద్రబాబు సవాల్ విసిరారు.